MOMOS FOOD POISON IN HYDERABAD : హైదరాబాద్‌లో మోమోస్ తిని మహిళ మృతిచెందగా, మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన వారిని వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. ఘటనపై బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల తెలిపిన వివరాలు ప్రకారం బంజారాహిల్స్ నందినగర్ సింగాడకుంట బస్తీలోని గౌరీ శంకర్ కాలనీలో శుక్రవారం సంత జరిగింది. ఈ సంతలో పలువురు మోమోస్ కొన్నారు.
వీటిని తిన్నవారిలో సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ బేగం (31) మృతి చెందగా, ఆమె పిల్లలు, ఆయా బస్తీల్లోని సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరికీ శనివారం నుంచి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో బంజారాహిల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలు ఆస్పత్రుల్లో వీరంతా చేరి చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మోమోస్ తిన్నవారిలో దాదాపు పది మంది పిల్లలు సైతం ఉన్నారు. తొలుత రేష్మ బేగం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ఆమె మృతి చెందారు.
మయోనైజ్ పనేనా?: ఈ ఘటనపై ఇప్పటికే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మోమోస్‌తో పాటు ఇచ్చే మయోనైజ్, మిర్చి చట్నీ కలుషితమై ఉండొచ్చని పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు. మోమోస్ వ్యాపారంతో పెద్ద రెస్టారెంట్లు మంచి లాభాలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో మోమోస్ కోసమే మల్టీప్లెక్స్‌లకు వెళ్లేవారు చాలా మంది ఉంటారు. ఒకప్పుడు కేవలం పెద్ద రెస్టారెంట్లలో మాత్రమే లభించే మోమోస్, ప్రస్తుతం ఇతర ఫాస్ట్‌ఫుడ్స్ మాదిరి చాలా చోట్ల దొరుకుతున్నాయి. దీంతో ఇవి చాలామందికి ఫేవరెట్ ఫుడ్‌గా అయిపోయి, ఎప్పుడైనా తినేందుకు చక్కని ఎంపికవుతున్నాయి. మరి ఈ మోమోస్ సంగతి ఏంటి?
ఫ్రెండ్స్‌తో స్నాక్స్ ఛాలెంజ్.. 150 మోమోస్ తిని యువకుడు మృతి!
మోమోస్‌కి పెద్ద చరిత్రే ఉంది: మోమోస్ లేదా డంప్లింగ్స్ ఇలా ఏ పేరుతో పిలిచినా వీటిని తొలిసారి తయారుచేసింది మాత్రం టిబెట్‌వాసులని అంటుంటారు. 14వ శతాబ్దంలో ఈ మోమోస్‌ను టిబెటన్లు తయారు చేశారు. కొన్నాళ్లకు నేపాల్‌కు వలస వెళ్లి స్థిరపడిన కొందరు టిబెటన్లు, అక్కడ కూడా మోమోస్ చేశారు. దీంతో నేపాలీలూ సైతం తమ వంటకాల లిస్ట్‌లో మోమోస్‌ను చేర్చుకున్నారు. అప్పటి నుంచి పండుగలకూ, ప్రత్యేక వేడుకలకూ వీటిని తయారుచేస్తూ ఉండేవారు. అదే విధంగా టిబెటన్లు భారత్‌కు వచ్చి లద్దాక్, డార్జిలింగ్, ధర్మశాల, సిక్కిం తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అలా మోమోస్ భారత దేశంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించింది.
వైన్‌షాపు దగ్గర దొరికే చికెన్ పకోడీ ఇదేనంట! - గుట్టు తెలిస్తే మత్తు దిగాల్సిందే!