Tips in Telugu To Get Govt Jobs : తెలంగాణలో దసరా పండుగ సందడే వేరు. అమ్మవారి పూజలు, బతుకమ్మ ఆటలు, దాండియా, గర్భా నృత్యాలతో ధూంధాం ఉంటుంది. మహిషాసురునిపై దుర్గాదేవి సాధించిన విజయానికి ప్రతీకగా, రాముడు రావణుడిని ఓడించి దసరా రోజు అయోధ్యకు వచ్చాడని చెడుపై మంచి సాధించిన విజయంగా దసరా పండుగను చేసుకుంటారు. తెలుసా ఈ పండుగ నేపథ్యం ఉద్యోగాలు వేటలో ఉన్న వారికి ఓ సందేశాన్నిస్తోంది. గెలుపు తీరాలను చేరుకోకపోవడానికి ఉన్న బలహీనతలను అధిగమిస్తే విజయం సొంతం చేసుకోవచ్చని దసరా పండుగ ద్వారా అర్థం చేసుకుంటే ఓ మంచి ఉద్యోగం మీ సొంతమవుతుంది.
2024 కొలువుల నామ సంవత్సరం. ఇప్పటికే వేల మంది నిరుద్యోగులు కష్టపడి చదివి సర్కారి కొలువులు సాధించారు. కొందరైతే నాలుగైదు ఉద్యోగాలకు అర్హత కూడా సాధించారు. వచ్చే వారం నుంచి గ్రూప్స్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. నవంబరులో గ్రూప్-3, డిసెంబరులో గ్రూప్-2 పరీక్షలను టీజీపీఎస్సీ నిర్వహించబోతుంది. పోస్టులు వందల సంఖ్యలోనే ఉండగా పోటీపడుతున్న అభ్యర్థులు మాత్రం లక్షల్లో ఉన్నారు. శ్రమిస్తేనే విజయం వరిస్తుందని కష్టపడేవారికే అదృష్టం వరిస్తుందని విద్యా నిపుణులు చెబుతున్నారు.
ఫోన్ పక్కన పెట్టేసి : రోజులో చాలా సమయం సెల్‌ఫోన్‌తోనే గడుపుతున్నాం. కనీసం పది నిమిషాలకు ఒక్కసారైనా చెక్ చేస్తాం. ఏదైనా మెసేజ్, కాల్ వచ్చిందా అని చూస్తాం. అలాగే ఫోన్ పట్టుకుని కూర్చుంటాం. కానీ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ప్రతి నిమిషం చాలా ముఖ్యం. మొదటగా చేయాల్సిన పని దీన్ని దూరం పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఇక ఆన్‌లైన్‌లో యాప్స్‌లో సన్నద్ధం అయ్యేవారు వాటి వరకే పరిమితం కావాలి. ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి క్లాసులు వినాలి. పొరపాటున చేతులు రీల్స్‌వైపు వెళ్లాయో కాలం ఇట్టే కరిగిపోతుంది.
పక్కా ప్లాన్ చేసుకుంటేనే : కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు రోజువారీ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. ఆ రోజు, ఆ వారం ఏ అంశాలను పూర్తి చేయాలి అనుకుంటున్నారో వాటిని పేపర్ పైన రాసి పెట్టుకోవాలి. అలా చేయకపోతే పరీక్షల నాటికి సిలబస్ పూర్తి చేసి రివిజన్ చేయడం చాలా కష్టతరం అవుతుంది. ప్లాన్ చేసుకోవడంలో ఇబ్బందులు ఉంటే నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటే హెల్ప్ అవుతుంది.
చివరి వరకు ప్రయత్నించాలి : పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సాధించాలి అంటే ఆరంభ శూరత్వం ఉండాలి. కొంతమంది ఫస్ట్‌లో బాగా చదువుతారు. కొన్ని రోజులకు డీలా పడిపోతుంటారు. పరీక్ష దగ్గరికి వచ్చేసరికి ఇంక అంతే సంగతి. అనవసరమైన విషయాలకు ఆందోళన పడుతుంటారు. తమకు సంబంధం లేనివి, దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్న అంశాలను పట్టించుకోకపోవడం ఉత్తమం. పరీక్షలకు సన్నద్ధం అయ్యేవారు ఏకాగ్రతను దెబ్బతీసే అంశాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మధ్యలోనే ఆపేయకుండా చివరి వరకు ప్రయత్నించాలి.
'సాలరీ ప్యాకేజ్' గురించి డిస్కస్ చేయాలా? ఈ టాప్-10 టిప్స్ మీ కోసమే! - How To Negotiate Salary
బద్దకం వదిలితేనే : షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తిగా చదవాలి అంటే నిర్దేశిత సమయం కేటాయించాలి. బద్దకించకుండా సమయానికి నిద్రలేచి చదవడం మొదలెట్టాలి. రాత్రి ఆలస్యంగా పడుకున్నాననే సాకుతో ఉదయం లేవడానికి బద్దకిస్తుంటారు. రోజుకు ఆరేడు గంటల నిద్ర సరిపోతుంది. మిగిలిన సమయాన్ని సిలబస్ పూర్తి చేయడానికి కేటాయిచాలి.
కుంటి సాకులు వద్దు : స్నేహితులు పిలిచారనో, వీకేండ్స్ అనే సాకుతోనో ప్రిపరేషన్‌కు విరామం ఇవ్వొద్దు. కొందరి విషయంలో విశ్రాంతి మంచి ఫలితాలే ఇచ్చినప్పటికీ చాలామందిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒక్కరోజే కదా అని పుస్తకం పక్కన పెట్టేస్తే చదవాలి అన్న ఇంట్రెస్ట్ పోతుంది. అదికాస్త ఏదో ఒకసాకుతో రెండు మూడు రోజులకు పెరుగుతుంది. అప్పుడు అనుకున్న సమయంలో సిలబసో లేకా ప్రిపరేషన్ పూర్తిచేయలేరనే విషయాన్ని గుర్తించాలి.
ప్రాక్టీస్ చేస్తేనే : పోటీ పరీక్షల సమయం రెండున్నర గంటల నుంచి 3 గంటలు ఉంటుంది. ఆ సమయంలోనే ఇచ్చిన ప్రశ్నలన్నీ పూర్తి చేస్తేనే రేసులో నిలబడతారు. విజయానికి దగ్గరవుతారు. చాలా మంది పరీక్ష పూర్తయిన తర్వాత బయటకు వచ్చి టైమ్ సరిపోలేదని చెబుతుంటారు. ఈ సమస్య పరీక్షలకు ముందు ప్రాక్టీస్ చేయకపోవడం వల్లనే. నమూనా ప్రశ్నాపత్రాల సాధన ఎంత చేస్తే అంత మంచిది. దాని ఫలితంగా సమయపాలన అలవాటు అవుతుంది. పరీక్షలు టైమ్‌కి రాయడం అలవాటు అవుతుంది.
మెయిన్ పాయింట్స్ రాసుకోవాలి : ఏదైనా టాపిక్ చదివినప్పుడు దాంట్లో ముఖ్యమైన అంశాలను నోట్స్ రూపంలో రాసుకుంటే ఎక్కువగా గుర్తుంటుందని విజేతలు చెబుతుంటారు. అయితే చాలా మంది అయితే చాలామంది చదవడం తప్ప రాసే అలవాటే లేదని చెబుతుంచారు. చదివి రాసినప్పుడు ఆ అంశాన్ని మెదడు రెండుసార్లు నోట్ చేస్తుంది. మళ్లీ చదివినప్పుడు ఈజీగా క్లిక్ అవుతుంది. సర్కారి కొలువు దక్కాలంటే విజేతలు చెబుతున్న ఈ మాటను తూచా తప్పక పాటించాల్సిందే. రివిజన్ సమయంలో వందల పేజీలను తిరగేయాల్సిన ఒత్తిడి లేకుండా రాసుకున్న నోట్స్‌ను సాధన చేస్తే చాలా సహాయపడుతుంది.
వారిని పక్కన పెట్టేద్దాం : ఏదో సాధించాలని తపన పడుతుంటే పక్కన ఉండేవారు నీ వల్ల కాదని నిరాశపరుస్తుంటారు. వెన్ను తట్టాల్సిందిపోయి వెనక్కి లాగుతారు. ఇలాంటి వారిని ఎంత దూరం పెడితే అంత మేలు. ప్రోత్సహించే వారిని పక్కన పెట్టుకుంటే అదే వెయ్యేనుగుల బలం.
జాబ్ ఇంటర్వ్యూకు వెళ్తున్నారా? ఉద్యోగం రావాలంటే 'ఆ పదాలు' అస్సలు వాడొద్దు!