Wings India Air Show 2024 Second Day : హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్టులో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2024(Wings India 2024) ప్రదర్శన రెండో రోజు సందడిగా సాగింది. విద్యార్థులు, యువతతో పాటు విమానయాన రంగానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొన్నారు. ఆయా ఎయిర్‌లైన్స్, కంపెనీల నూతన ఒరవడి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఫోటోలు, వీడియోలతో విజిటర్లు సందడి చేశారు.
రానున్న 20 ఏళ్లలో విమాన ప్రయాణికుల్లో 8 శాతం వృద్ధితో అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న వాణిజ్య విమానయాన మార్కెట్‌గా దక్షిణాసియా అవతరిస్తుందని బోయింగ్(Boeing) అంచనా వేసింది. దీనికి భారతే నాయకత్వం వహిస్తుందని తెలిపింది. వింగ్స్ ఇండియా ప్రదర్శన దేశంలో బలమైన ఆర్ధిక వ్యవస్థతోపాటు, వేగంగా విస్తరిస్తున్న మధ్య తరగతి విమాన ప్రయాణికుల వృద్ధికి దోహదం చేస్తుందని బోయింగ్ కమర్షియల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ డారెన్ హల్ట్స్ తెలిపారు.
Boeing on Aviation Growth in India : 2042 నాటికి భారత్ సహా దక్షిణాసియాకు 2,705 కొత్త విమానాలు అవసరం అవుతాయని వెల్లడించారు. వాటిలో 92 శాతం విమానాలు భారత్‌కే కావాల్సి ఉందని వివరించారు. దాదాపు 28 శాతం పాత విమానాలు అధునాతన సాంకేతిక విహంగాలతో భర్తీ అవుతాయన్నారు. రాబోయే మూడేళ్లలో భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందని, మధ్య ఆదాయ కుటుంబాలు పెరుగుతాయని అంచనా వేశారు.
కరోనాకు పూర్వం 2019తో పోలిస్తే 2023లో దేశీయ నెలవారీ ప్రయాణికుల సంఖ్య 7 శాతం మేరకు పెరిగిందన్న డారెన్, అంతర్జాతీయ ప్రయాణికుల్లో 30 శాతం వృద్ధితో మళ్లీ అగ్రస్థానానికి చేరిందన్నారు. 2019తో పోలిస్తే 2024 ఏప్రిల్ నాటికి సుదూర ప్రయాణాలు చేస్తున్న వారి సంఖ్యలో 50 శాతం పెరుగుదల నమోదయ్యే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. భారతీయ విమానయాన సంస్థలు తక్కువ ఛార్జీలతోనే సేవలందిస్తున్నాయని డారెన్ అన్నారు.
రానున్న 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 42,592 కొత్త విమానాలు అవసరమవుతాయని తెలిపారు. దక్షిణాసియా ప్రాంతానికి 20 ఏళ్లలో 37,000 మంది పైలెట్లు కావాలన్న ఆయన, సాంకేతిక నిపుణులూ 38,000 మంది అవసరం అవుతారని అంచనా వేశారు. ప్రస్తుతం భారత్‌లో 15 సరకు రవాణా విమానాలున్నాయని, 20 ఏళ్లలో వీటి సంఖ్య 80కి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు.
"రానున్న 20 ఏళ్లలో విమాన ప్రయాణికుల్లో 8 శాతం వృద్ధితో అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న వాణిజ్య విమానయాన మార్కెట్‌గా దక్షిణాసియా అవతరించబోతుంది. 2042 నాటికి భారత్ సహా దక్షిణాసియాకు 2,705 కొత్త విమానాలు అవసరం అవుతాయని వెల్లడించారు. వాటిలో 92 శాతం విమానాలు భారత్‌కే కావాల్సి ఉంది". - డారెన్ హల్ట్స్, వైస్ ప్రెసిడెంట్, బోయింగ్ కమర్షియల్ మార్కెటింగ్