Wines Shops Closes in TG on Lok Sabha Election Counting: మరికొన్ని గంటల్లో లోక్సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. జూన్ 4 ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. దీంతో ఓట్ల లెక్కింపు సందర్భంగా హైదరాబాద్ సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం దుకాణాలు బంద్ సహా పలు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని అతిక్రమించిన వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో..
మద్యం దుకాణాలు బంద్: మద్యం ప్రియులకు వరుస షాకులు తగులుతున్నాయి. ఏప్రిల్ నెలలో రెండు రోజులు, మే మాసంలో ఏకంగా నాలుగు రోజులు బంద్ అయిన మద్యం దుకాణాలు తాజాగా మరోసారి మూతపడనున్నాయి. లోక్సభ ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జూన్ 5 బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలు ఎవరు అతిక్రమించిన కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే జనసంచారం కలిగిన ప్రాంతంలో బాణాసంచాలను కాల్చడము, విసిరేయొద్దని సీపీ కొత్త కోట శ్రీనివాస రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
జంట నగరాల్లో 144 సెక్షన్ అమలు: ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గొడవలకు ఆస్కారం లేకుండా రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. గుంపులుగా తిరుగుతూ అల్లర్లకు తావివ్వకుండా ఆంక్షలు విధించారు. నగరంలో ఐదుగురికి మించి గుమిగూడకుండా ఆంక్షలను అమలు చేస్తున్నారు. అల్లర్లకు అవకాశం లేకుండా 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని హైదరాబాద్ సీపీ ఆదేశాలిచ్చారు.
మూడంచెల భద్రత: అన్ని కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతా విధానం అమలు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి కేవలం ఎన్నికల సంఘం జారీ చేసిన పాసులు ఉన్న సిబ్బంది, వివిధ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు, మీడియా ప్రతినిధుల్ని మాత్రమే అనుమతిస్తారు. సెల్‌ఫోన్లు, అగ్గిపెట్టెలు, రికార్డింగ్ చేసే అవకాశమున్నవి, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని లోపలికి అనుమతించరు. సిబ్బంది ఎవరైనా ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.
తొలి దశలో స్థానిక పోలీసులు విధుల్లో ఉంటారు. వీరు కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపేసి నిషేధిత వస్తువులున్నాయో లేదో తనిఖీ చేసి పాసులున్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. రెండో దశలోనూ ఏఆర్, ఎస్పీఎఫ్ పోలీసులు తనిఖీ చేస్తారు. వీరు కౌంటింగ్ ఏజెంట్లను, ఎన్నికల సిబ్బందిని వేర్వేరు మార్గాల్లో లోపలికి పంపిస్తారు. మూడో దశలో కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మరోసారి తనిఖీ చేశాక లోపలికి పంపిస్తారు.