Wines Close in Telangana : తెలంగాణలో గణేశ్ నవరాత్రోత్సవాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. మరో మూడు రోజుల్లో వినాయక నిమజ్జనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నిమజ్జనం సందర్భంగా మద్యం దుకాణాలు మూసేయాలని కూడా నిర్ణయించారు.
హైదరాబాద్ లో గణపతి నిమజ్జనం ఈ నెల 17వ తేదీన ఉంటుందని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రాజవర్దన్‌రెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. హైకోర్టు ఉత్తర్వుల పేరిట వదంతులు వ్యాపిస్తున్నాయని, వాటిని నమ్మొద్దని అన్నారు. గణేశ్ నిమజ్జనాలపై కోర్టు ధిక్కార పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసిందని.. నిమజ్జనానికి ఎలాంటి అడ్డంకులూ లేవని చెప్పారు. ఎన్టీఆర్ మార్గ్ , నెక్లెస్ రోడ్డులో సర్కారు ఏర్పాట్లు చేసిందని.. సాగర్ లో నిమజ్జనం చేసుకోవచ్చని అన్నారు.
మద్యం దుకాణాలు బంద్..
నిమజ్జనం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలు మూసేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17 మంగళవారం, బుధవారాల్లో ఈ బంద్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ ఆదేశాలు వైన్ షాపులతోపాటు కల్లు దుకాణాలు, బార్లకూ వర్తిస్తాయని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గణేశ్ నిమజ్జనంతోపాటు మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు కూడా ఉండడంతో.. అవి సజావుగా సాగేలా చూడాలని పోలీసులు, సిబ్బందికి సీవీ ఆనంద్ సూచించారు. రెండు జోన్లలోనూ సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయని.. కమ్యూనల్ రౌడీలు, సంఘ విద్రోహ శక్తులపై పూర్తి నిఘా ఉంచాలని సూచించారు.
ప్రత్యేక రైళ్లు..
గణేశ్ నిమజ్జనం వేళ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 8 రైళ్లు నడుస్తాయని పేర్కొంది. 17, 18 తేదీల్లో లింగంపల్లి, ఫలక్‌నుమా, సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి రాత్రి, ఉదయం వేళ ఈ రైళ్లు నడుపనున్నట్లు పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
మందుబాబులకు మింగుడు పడని వార్త - ఆ 2 రోజులు మద్యం దుకాణాలు బంద్