Widening and Upgrading of 2 NH Projects Get Central Clearance : అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న జాతీయరహదారి (544D)లో రెండు కీలక ప్యాకేజీలను నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. బుగ్గ-గిద్దలూరు మధ్య 135 కి.మీ, వినుకొండ-గుంటూరు మధ్య 84.80 కి.మీ కలిపి మొత్తం 219.80 కి.మీ (దాదాపు 220 కి.మీ.) విస్తరణ పనుల్లో రెండు ఎలైన్‌మెంట్లకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటి నిర్మాణానికి మొత్తం రూ.5,417 కోట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) వెచ్చించనుంది. రెండు ప్యాకేజీల్లో 21 చోట్ల బైపాస్‌లు నిర్మించేందుకు అనుమతించింది.
గిద్దలూరు-వినుకొండ మినహా : అనంతపురం నుంచి ముచ్చుకోట, బుగ్గ, కైప, గిద్దలూరు, వినుకొండ మీదగా గుంటూరు వరకు ఎన్‌హెచ్-544డి ఉంది. ఇందులో అనంతపురం నుంచి బుగ్గ వరకు నాలుగు వరుసలుగా విస్తరణ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. గిద్దలూరు-వినుకొండ మధ్య 135 కి.మీ రెండు వరుసలుగా విస్తరించి 2022లో అందుబాటులోకి తెచ్చి, దాని నిర్వహణ గుత్తేదారుకు అప్పగించారు.
ఇక మిగిలిన బుగ్గ-గిద్దలూరు, వినుకొండ నుంచి గుంటూరు మధ్య విస్తరించాల్సి ఉంది. తాజాగా ఈ రెండు ప్యాకేజీల్లో నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. అంటే అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న నాలుగు ప్యాకేజీల్లో గిద్దలూరు నుంచి వినుకొండ మధ్య 135 కి.మీ. మినహా, మిగిలిన రోడ్డంతా నాలుగు వరుసలు అవుతుంది.
అటవీ ప్రాంతంలోనూ నాలుగు వరుసలు
- బుగ్గ-గిద్దలూరు మధ్య 135 కి.మీ విస్తరణలో 25 కి.మీ నల్లమల రక్షిత అటవీ ప్రాంతం మీదగా వెళ్తుంది. దీంతో అక్కడ రెండు వరుసలుగానే విస్తరించాలని భావించారు. రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తితో నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కమిటీ ఆమోదించింది. వివిధ అనుమతులకు రాష్ట్రప్రభుత్వం సహకరించాలని కోరింది. రక్షిత అటవీ ప్రాంతం కావడంతో నాలుగు వరుసలుగా విస్తరణకు అనుమతులు రాకపోతే ఆ 25 కి.మీ. రెండు వరుసలకే పరిమితం కావాలని కమిటీ సూచించింది.
- వినుకొండ-గుంటూరు ప్యాకేజీలో రహదారి అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డులో పేరేచర్ల సమీపంలో కలిసేలా నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో మెగా సిటీలుగా ఆ ప్రాంతాలు - అమరావతి ఓఆర్ఆర్తో మారనున్న రూపురేఖలు
బుగ్గ- గిద్దలూరు ప్యాకేజీ | |
మొత్తం | 135 కి.మీ |
పాత రహదారి(బ్రౌన్ ఫీల్డ్) | 66 కి.మీ |
కొత్తగా 15 బైపాస్‌లు(గ్రీన్ ఫీల్డ్) | 69 కి.మీ |
అవసరమైన భూమి | 302 హెక్టార్లు |
భూసేకరణ వ్యయం | రూ.104 కోట్లు |
మొత్తం వ్యయం | 2,812 కోట్లు(ఇతర పనులతో కలిపి) |
సగటున కి.మీ.కు అయ్యే ఖర్చులు | రూ. 20.83 కోట్లు |
15 బైపాసులు ఇవే : అంకిరెడ్డిపల్లి, రాఘవరాజుపల్లి- కనకాద్రిపల్లి, కొలిమిగుండ్ల, రామాపురం- అవుకు, బనగానెపల్లె, కైప, అప్పలాపురం, టంగుటూరు, రాయపాడు- తెల్లపురి, పసురపాడు, ఎస్.నాగులవరం, దీబగుంట్ల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు.
వినుకొండ-గుంటూరు ప్యాకేజీ | |
మొత్తం | 84.80 కి.మీ |
పాతరహదారి(బ్రౌన్ ఫీల్డ్) | 41.80 కి.మీ |
కొత్తగా 6 బైపాస్‌లు(గ్రీన్ ఫీల్డ్్) | 43 కి.మీ |
అవసరమైన భూమి | 291.88 హెక్టార్లు |
భూసేకరణ వ్యయం | రూ.380 కోట్లు |
సివిల్ పనులకప | రూ.2,225.36 కోట్లు |
మొత్తం వ్యయం | రూ.2,605.36 కోట్లు |
సగటున కి.మీ.కు వెచ్చించేది | రూ.30.72 కోట్లు |
6 బైపాస్‌లు : వినుకొండ-శ్యావల్యపురం, సంతమాగులూరు-పాత మాగులూరు,పెట్లూరివారిపాలెం, జొన్నలగడ్డ, సాతులూరు, ఫిరంగిపురం.
189 కిలోమీటర్లు, ఆరు వరుసలతో అమరావతి ORR - కేంద్ర కమిటీ ఆమోదం