Central Cabinet Minister Chance in Telangana MP'S : తెలంగాణలో రెండంకెల స్థానమే లక్ష్యంగా సార్వత్రిక సమరంలో బీజేపీ దూకినప్పటికీ, మెరుగైన ఫలితాలతో సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. తొలిసారిగా బీజేపీ తరఫున రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు విజయం సాధించడంతో కేంద్ర మంత్రి పదవులపై నేతల్లో ఆశలు పెరుగుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డి సహా నలుగురు ఎంపీ అభ్యర్థులు గెలుపొందారు.
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన జి.కిషన్‌రెడ్డికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. ఈ ఎన్నికల్లో కిషన్‌రెడ్డి మరోసారి సికింద్రాబాద్ నుంచి గెలుపొందారు. ఆయనతోపాటు కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి, ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ నుంచి రెండోసారి సిట్టింగ్ స్థానాలను నిలుపుకున్నారు. ఐతే గతంలో రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న బండిని అనూహ్యంగా తప్పించి, కిషన్‌రెడ్డిని పార్టీ ప్రెసిడెంట్‌గా చేయటం వంటివి కమలం శ్రేణుల్లో కొంత గందరగోళాన్ని సృష్టించాయి.
సీనియార్టీ హవా - కేంద్రపదవి కలిసొచ్చేనా? : శాసనసభ ఎన్నికలు ముందర జరిగిన ఆ మార్పులు కొంత పార్టీకి నష్టాన్ని కలిగించాయన్నది విశ్లేషకుల మాట. ఈ క్రమంలోనే బండి సంజయ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా హైకమాండ్ నియమించింది. మరో విశేషమేమిటంటే, బండి సహా ధర్మపురి అర్వింద్ ఇద్దరూ గత రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఓడి, పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకొని తమ తమ సిట్టింగ్ స్థానాలను నిలుపుకున్నవారే.
మల్కాజిగిరి నుంచి బరిలో దిగిన ఈటల రాజేందర్, ఆది నుంచి భారీ ఆధిక్యంతో దూసుకెళ్లి విజయ దుందుభి మోగించారు. అలాగే చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ స్థానం నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ గెలుపొందారు. వీరంతా రాష్ట్రానికి సంబంధించి పార్టీలో కీలకంగా ఉన్న నేతలే. వీరిలో ఒకరిద్దరు మినహా ప్రస్తుతం గెలిచిన వారందరూ సీనియర్లే కావడంతో కేంద్ర మంత్రి పదవి ఎవరిని వరిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.
Telangana BJP MP Winner List 2024 : రాష్ట్రం నుంచి ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులు విజయం సాధించిన నేపథ్యంలో ఒకరు లేదా ఇద్దరికి మంత్రి పదవులకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా జాతీయ నాయకత్వం తనకే ప్రాధాన్యమిస్తుందనే విశ్వాసంతో ఎవరికి వారు ఉన్నారు. మరి హైకమాండ్ ఎవరి పట్ల మొగ్గుచూపుతుందో వేచిచూడాల్సిందే.