Who will Get Lok Sabha Tickets in Mahabubnagar District : లోక్‌సభ ఎన్నికలకి గడువు సమీపిస్తున్నకొద్దీ ప్రధానపార్టీల నుంచి బరిలోదిగే అభ్యర్థులెవరనే అంశంపై ఉత్కంఠ పెరుగుతోంది. అందులో ప్రథమంగా ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. ఈసారి మాత్రం ముందుగా రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో(Lok Sabha Polls 2024) మహబూబ్‌నగర్ ఎంపీగా చల్లా వంశీచంద్‌రెడ్డిని ప్రకటించింది. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన కాంగ్రెస్ నుంచి పోటీచేశారు. నాగర్‌కర్నూల్ అభ్యర్థి ఎవరన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. అక్కడ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్న మల్లురవి ఇప్పటికే దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. అయితే అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గుచూపుతుందన్నది వేచి చూడాల్సిందే.
"నాగర్ కర్నూల్‌కు ఎంపీ టికెట్ కోసం 26 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయడం జరిగింది. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని నాడే చెప్పాను. అందుకే ఎమ్మెల్యేగా జడ్చర్లలో పోటీ చేయనని అధిష్ఠానానికి తెలిపాను. దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవికి అందుకే రాజీనామా చేశాను. ఈ విషయంపై ఇప్పటివరకు చెప్పలేదు. పరిస్థితులు మారుతుండడంతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది." - మల్లు రవి, మాజీ ఎంపీ
బీజేపీలో తీవ్ర పోటీ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP) ఈసారి రెండు పార్లమెంట్ స్థానాలు దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. మహబూబ్‌నగర్ నుంచి పోటీకి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి బండారు శాంతికుమార్ తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఇతరులకు త్యాగం చేసిన శాంతికుమార్ ఈసారి తనకే అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. స్థానికులు, స్థానికేతరులు, రెడ్డి- బీసీలనే వర్గాలుగా విడిపోయి టికెట్ తమకే కేటాయించాలనే డిమాండ్ చేస్తున్నారు. నాగర్‌కర్నూల్(Nagar Kurnool MP Seat) నుంచి పోటీ లేకపోయినా ఇతర పార్టీల నుంచి చేరనున్న ఒకరికి టికెట్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. జనంలో మంచి పలుకుబడి, పేరు ఉన్న నేత కావడంతో ఆయన్ని బరిలో దింపితే ఆ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకుంటామన్న ధీమాలో ఉంది. లేదంటే గతంలో నాగర్ కర్నూల్ నుంచి పోటీచేసిన బంగారు శృతికి మరోసారి అవకాశం దక్కొచ్చు.
పాలమూరు బీజేపీ లోక్‌సభ సీటు ఎవరిది? - రేసులో ఆ ముగ్గురు కీలక నేతలు
BRS Mahabubnagar MP Tickets : బీఆర్ఎస్ నుంచి 2స్థానాలకు బరిలో దిగే అభ్యర్థులు ఎవరనే అంశంపైనా విస్తృతంగా చర్చ సాగుతోంది. నాగర్‌కర్నూల్ స్థానంపై అందరి దృష్టి పడింది. నాగర్ కర్నూల్, అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంట్ సన్నాహక సమావేశాలకు(BRS Public Meeting) సిట్టింగ్ ఎంపీ రాములుకి ఆహ్వానం అందలేదు. కేటీఆర్ జిల్లాకు చేరుకున్న తర్వాత చివరి నిమిషంలో రమ్మని పిలుపొచ్చినా రానని తేల్చి చెప్పారు. గతంలో రాములు కుమారుడు, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్‌ని నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా ఎన్నిక చేసేందుకు రెండుసార్లు అవకాశం వచ్చినా స్థానికనేతలు అడ్డుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రాములు అచ్చంపేట టిక్కెట్ ఇవ్వాలని కోరినా అధిష్ఠానం పట్టించుకోలేదు. ఆ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కంటే ఓ జాతీయ పార్టీ నుంచి ఎంపీ బరిలో దిగాలని రాములు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే నాగర్‌కర్నూల్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరనే చర్చ సాగుతోంది. గతంలో ఎంపీగా పోటీసి ఓటమిపాలైన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు అవకాశం దక్కేలా కనిపిస్తోంది. పాలమూరు నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డినే నిలుపుతారా లేదా అభ్యర్థిని మార్చుతారా తేలాల్సి ఉంది.
"ఈరోజుకైనా ఏ రోజుకైనా పెద్దలు చెబుతారు వెట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలే అని. ఈ గులాబీ జెండా ఉంటేనే గల్లీ నుంచి దిల్లీ దాకా తెలంగాణకు ప్రయోజనాలు. పార్లమెంటు, అసెంబ్లీలో గళం విప్పాలంటే మిగిలిన వారికి సత్తా లేదు. కేవలం గులాబీ పార్టీకి మాత్రమే ఉంది. ఎక్కడ పోగోట్టుకున్నామో అక్కడే వెతుక్కుంటాం." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి గట్టి పోటీ - త్రిముఖ పోరులో గెలిచేదెవరో?
చేరికలను ఆహ్వానిస్తూ, బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తూ - 'పార్లమెంట్'లోనూ హస్తం 'అసెంబ్లీ' స్ట్రాటజీ