Who is Andhra Pradesh New DGP : డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం సీనియారిటీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత స్థానాల్లో రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్, 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా, 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు.
అయితే కొత్త డీజీపీ నియామకం కోసం ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను ప్రభుత్వం ఈసీకి పంపించింది. ఈ ప్యానెల్లో ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్‌కుమార్ గుప్తా పేర్లు ఉన్నాయి. వీరిలో ఒకరిని ఎన్నికల సంఘం డీజీపీగా ఎంపిక చేయనుంది. ఈ సాయంత్రానికి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. హరీష్‌కుమార్ గుప్తా హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఈసీ వేటు - బదిలీ చేయాలని సీఎస్‌కు ఆదేశాలు - EC TRANSFERRED DGP
ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా రాజేంద్రనాథరెడ్డి అధికార పార్టీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని, ఆయనే డీజీపీగా కొనసాగితే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరగవని ప్రతిపక్షాలు మొదటి నుంచి చెబుతున్నాయి. ఎన్నికల సంఘం ఆ ఫిర్యాదులపై చాలా ఆలస్యంగా స్పందించింది. ఎన్నికల్లో వైకాపాకు ప్రయోజనం చేకూర్చేలా ఆయన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు ఎన్నికల సంఘం ఆయనపై బదిలీ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆయనకు ఎన్నికల సంబంధించిన ఎలాంటి విధులూ అప్పగించొద్దని నిర్దేశించింది.
సీఎం జగన్ డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టేసి మరీ 2020 ఫిబ్రవరి 15న కేవీ రాజేంద్రనాథరెడ్డిని ఇన్‌ఛార్జి డీజీపీగా నియమించారు. రెండేళ్ల రెండు నెలలుగా ఆయన్ను అదే హోదాలో కొనసాగిస్తున్నారు. పూర్తిస్థాయి డీజీపీ ఎంపికకు అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోం శాఖ పదే పదే లేఖలు రాసినా ఖాతరు చేయలేదు. డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన ఆదేశాలను పట్టించుకోలేదు. రాజేంద్రనాథరెడ్డి ‘తమవాడు’ కావటమే ఏకైక అర్హతగా సీనియార్టీ జాబితాలో అట్టడుగున ఉన్నా సరే ఆయన్ను డీజీపీగా నియమించారు.