AP Land Titiling Act 2023: ప్రజల ఆస్తులకు ముప్పని తెలిసినా ఏ మాత్రం పట్టించుకోకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 చట్టాన్ని తీసుకొచ్చింది. భూమిని దోచుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించి తీసుకొచ్చిన ఈ చట్టం రైతుల పాలిట శాపంగా మారింది. కొత్త చట్టం ద్వారా జగన్ తనకు అడ్డొస్తున్న న్యాయవ్యవస్థను పక్కన పెట్టడంపై న్యాయవాదులు భగ్గమన్నారు. దళితులు, గిరిజనులు, సన్న చిన్నకారు రైతులు, పేదల భూములను కబ్జా చేసేందుకే తప్ప ఈ చట్టంలో మరేమి లేదని అంటున్నారు. మరి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ చట్టంను ఎందుకు తీసుకొచ్చింది.? రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న జగన్ అసలు ఏం చేయాలనుకున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం.
land titiling act 2023: జగన్ మెుదటి నుంచి ప్రజలకోసం కాక ప్రజల ఆస్తులను ఎలా కొట్టేయాలనే ఆలోచనతోనే పని చేయడం మెుదలు పెట్టారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రజలకు ఏ మాత్రం అవసరం లేని అనాలోచిత చట్టాలను తెరపైకి తెచ్చి జనాలను ముప్పు తిప్పలు పెట్టారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం - ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్-2023ను గతేడాది అక్టోబర్ 31 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం గతేడాది జీనో 512ను జారీ చేసింది. దీంతో భూ యజమానులు, కొనుగోలుదారులకు భూమి హక్కులపై భరోసా కోల్పోవాల్సిన దుస్థితి వచ్చింది. వివాద పరిష్కారాల కోసం కోర్టుకు వెళ్లకుండా రైతుల స్వేచ్ఛను వైఎస్సార్సీపీ ప్రభుత్వం హరించింది. ముఖ్యంగా కొనుగోలు సమయాల్లో జరిగే అవకతవకలను ఇక నుంచి ట్రైబ్యునళ్లలో ప్రభుత్వం నియమించే TRO పరిష్కరిస్తాడని చెప్పడంతోనే అసలు సమస్య మెుదలైంది. లంచాలిస్తే పని కాదని ముద్రపడిన రెవెన్యూ వ్యవస్థపై ప్రజల్లో విశ్వసనీయత అంతంతే. భూముల వివాదాలను పరిష్కరించే బాధ్యతను రెవెన్యూ అధికారులకు అప్పగించడం వల్ల ప్రజలకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని, ఇది ప్రజలకు ఆర్థికంగా భారమని న్యాయవాదులు చెబుతున్నారు.
2023 land titiling act: ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతల భూ బాగోతాల కథలేంటో రాష్ట్రవ్యాప్తంగా చూస్తున్నాం. ఇప్పుడు భూ సమస్యల పరిష్కారం కోసమని ఈ కొత్తనాటకం తెరపైకి తెచ్చారు. దీని వల్ల సామాన్యూలు ప్రభుత్వ అధికారుల పెత్తనాన్ని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ చట్టం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 500కు పైగా ఉన్న సివిల్ కోర్టుల్లో దావాల దాఖలుకు వీల్లేకుండా నిషేధించారు. భూ వివాదాలకు సంబంధించి చట్టం తెలిసిన న్యాయ కోవిదులను జగన్ పక్కన పెట్టేసి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ - TRO, ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ - LTOలను తీసుకొచ్చారు. ఏపీ ల్యాండ్ అథారిటీ ఏ వ్యక్తినైనా టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా నియమించవచ్చని సెక్షన్ 5 (1) లో అనుకూల సెక్షన్ పొందుపరిచారు. మరి, వీరి అర్హతలేమిటి? ఏ శాఖకు చెందిన, ఏస్థాయి అధికారిని నియమిస్తారో తెలియదు. అయితే, ఈ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుండటంతో అధికార పార్టీకి ఎక్కువగా లాభం చేకూర్చడం తప్ప రైతులకు మేలు చేసే ఉద్దేశం లేదు.
భూయజమానుల హక్కుల్ని హరించేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
andhra pradesh land titiling act: ఇన్ని రోజులు రైతులు తమ భూమి సమస్యలను పరిష్కరించండి అంటూ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు. ఐనా, ఫలితం లభించలేదు. తిరిగి మళ్లీ అలాంటి అధికారులకే అధికారాన్ని కల్పించడం జగన్ పాలనా దక్షతకు నిదర్శనం. పనిని సులభం చేయాల్సిన వ్యక్తే తిరిగి చిక్కుల్లో పడేయడమంటే ఇదే కావొచ్చు. ఇన్ని రోజులు కనీసం కోర్టులకైనా చెప్పుకునే వీలు ఉంది. ఇప్పుడు ప్రజలు వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి. ఈ చట్టం వల్ల ఇప్పటి వరకు భూములకు ఉన్న 30 రకాల రికార్డులు అంటే పట్టాదారు పాస్ బుక్, టైటిల్ డీడ్, అడంగళ్, 1బి లాంటివి ఇక కన్పించవంటున్నారు. అదే జరిగితే కొన్నేళ్ల నుంచి భూ అనుభవదారు పట్టా కలిగిన రైతుల పరిస్థితేంటి. ఈ చట్టంతో సివిల్ కోర్టుల్లో దాఖలు చేయాల్సినవి ఇక నుంచి ప్రతి జిల్లా కేంద్రంలో ఉండే ట్రైబ్యూనళ్లలో చేసుకోవాలి. అయితే, ఇన్ని కోర్టులలో ఉన్న లక్షల సమస్యలు 26 ట్రైబ్యూనళ్లలో త్వరితగతిన పరిష్కస్తామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరం గాక మరేంటని నిపుణులు అంటున్నారు.
land titiling act: భూ హక్కు చట్టం ద్వారా అధికార పార్టీ నేతలు ఒత్తిడితో నిరక్షరాస్యులు, రైతుల భూములను ఇతరుల పేర్లపై మార్చేయవచ్చు. ఇందులో వైఎస్సార్సీపీ నేతలు చాలా సిద్ధహస్తులు. అలాగే ఒకసారి టైటిల్ రిజిస్టర్‌లో పేరు చేరితే ఇష్టానుసారంగా మార్చడానికి వీలుండదు. అది బలమైన సాక్ష్యమని టైటిలింగ్ చట్టం చెబుతోంది. కానీ, రిజిస్టర్‌లో పేర్లు చేర్చే క్రమంలో కొందరు అధికారులు రాజకీయ నేతలు చెప్పినట్లు తారుమారు చేసే ప్రమాదముంది. అలాగే వివాదాన్ని పరిష్కరిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను 15 రోజుల్లోపు టీఆర్‌వో దృష్టికి తీసుకురావాలి. కోర్టుల తీర్పు ప్రతులను 15 రోజుల్లోనే టీఆర్‌వో దృష్టికి తీసుకెళ్లకుంటే వాటిని అమలు చేయడం సాధ్యంకాదని చెప్పడం ప్రభుత్వ లెక్కలేనితనానికి నిదర్శనం. ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు ప్రస్తుతం యజమానుల దగ్గరే ఉంటున్నాయి. క్రయవిక్రయాల సమయంలో వాటిని అధికారికంగా వాడుకోవచ్చు. తాజా చట్టం ప్రకారం ఈ దస్తావేజులకు విలువే లేకుండా పోనుంది. ముఖ్యంగా అధికారులను దారిలోకి తెచ్చుకొని ఎవరైనా ప్రభుత్వ, దేవాదాయ భూములకు యజమానిగా టైటిల్ రిజిస్టర్‌లో వారి పేరు చేర్పించుకుంటే దాని గురించి పట్టించుకునే వాళ్లుండరు ఇలా మెుత్తం వైకాపా నాయకులకు అనుకూలంగా మార్చుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తీసుకొచ్చారు.
ప్రాసల నేత 'పైసా'చికత్వం - అ'ధర్మ' బాటలో వైఎస్సార్సీపీ నేత అరాచకాలు
ap land titiling act: ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంతో ప్రజల ఆస్తులకు రాష్ట్రంలో రక్షణ కరవైంది. ముఖ్యంగా తమకు ఎన్నో ఏళ్లుగా అడ్డుగా వస్తోన్న న్యాయవ్యవస్థను జగన్ ఈ చట్టం ద్వారా అడ్డు తొలగించుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని స్థిరాస్తులన్నింటిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం కన్నేసింది. అందులో భాగంగానే భూముల రీ-సర్వే చేస్తోంది. అది పూర్తైతే ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారీతినా వైఎస్సార్సీపీ నాయకులు హక్కులు పొందడం ఎంతో సులభమవుతుంది. అదే జరిగితే మాయల మరాఠి అయినా జగన్ రాత్రికి రాత్రే భూములను పేపర్ల మీద అమ్మేసినా చెప్పుకునే దిక్కు ఉండదు. ప్రస్తుతానికి ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని చెబుతూ చట్టం అమలుకు నిబంధనలు కూడా ఇంకా తయారు చేయలేదని కల్లబొల్లి మాటలను ప్రభుత్వం వల్లెవేస్తోంది. ఇదంతా ఎన్నికల వేళ జగన్ ప్రదర్శిస్తోన్న నాటకమని అర్థమవుతోంది కదా.