Waterfalls Overflowing in Tirumala Seshachalam Forest : తిరుమలగిరులు సరికొత్త శోభ సంతరించుకొన్నాయి. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు పాల ధారల్లా తెల్లని నురుగుతో కనువిందు చేస్తున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఒకటో కనుమ రహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది.
ఏడుకొండల్లో పరచుకొన్న పచ్చదనం ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్న జలపాతం భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. కపిలతీర్థం జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కరణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు. తిరుమలలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున టీటీడీ ప్రత్యేక నిఘా పెట్టింది. ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు.
తిరుమలలో భారీ వర్షం - ఆ దారులు మూసివేత
తిరుపతి జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడి కేంద్రాలకు అధికారులు సెలవు ప్రకటించారు.
వర్షాల నేపథ్యంలో తిరుమలలో టీటీడీ పలు జాగ్రత్తలు చేపట్టింది. కొండ చరియలపై ప్రత్యేక నిఘా, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. గోగర్భం, పాపవినాశనం జలాశయాలు పూర్తిస్ధాయి నీటి మట్టానికి చేరాయి. ఎగువ కురిసిన వర్షాలతో ఒకటో కనుమరహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం పొంగిపోర్లుతోంది.
మరింత బలపడనున్న అల్పపీడనం - రైతులకు కీలక సూచనలు
కేవీబీపురం మండలంలో ఎడతెరిపిలేని వర్షంతో కాళంగి జలాశయానికి వరదనీరు భారీగా చేరుతుంది. 10 గేట్లను 8 అడుగుల మేర ఎత్తి 5,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. రేణిగుంట పంచాయతీలోని బాలాజీ నగర్ కు వర్షపు నీరు భారీగా చేరింది. కరకంబాడి పంచాయతీలోని మల్లెమడుగు రిజర్వాయర్ కు శేషాచలం కొండల నుంచి వర్షపు నీరు భారీగా చేరుతుంది.
కేవీబీ పురం మండలంలో వరదనీటి ఉధృతికి శ్రీకాళహస్తి - పిచ్చాటూరు ప్రధాన మార్గంపై వరదనీరు పోటెత్తింది. కోవనూరు తిమ్మసముద్రం వద్ద ప్రధాన మార్గంపై ఉధృతంగా నీరు ప్రవహిస్తుండటంతో మండలంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కేవీబీ పురం మండలం ఎగువపూడి- ఎంఏ రాజుల కండ్రిగ మధ్య ఉన్న కాజ్ వే మరోసారి కొట్టుకుపోయింది.
కొనసాగుతున్న అల్పపీడనం - ధాన్యంపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తిరుపతి జిల్లాలోని తిరుమల, సూళ్లూరుపేట ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఘాట్ రోడ్లలో ప్రయాణించే శ్రీవారి భక్తులు, వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు.
ఉధృతంగా వరద ప్రవహిస్తోన్న లక్ష్మీపురం కూడలి, గొల్లవానిగుంట లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులను ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా హెచ్చరికలు పంపి అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణ శాఖను హోంమంత్రి అనిత ఆదేశించారు.