భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు వర్షపునీటిని ఒడిసిపట్టడానికి, ఇంటింటా ఇంకుడు గుంతలు తవ్వించేందుకు రాష్ట్ర, జిల్లా, జీహెచ్‌ఎంసీ స్థాయి కమిటీలు విస్తృత చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీనిని ప్రాధాన్యాంశంగా గుర్తించాలని నిర్దేశించింది. నీటిని పొదుపు చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీలకు మార్గదర్శకాలు విడుదల చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ది శాఖల ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
నీటి వృథాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశిస్తూ ఈ ఏడాది మార్చి నెలలో హైకోర్టు జారీచేసిన ఆదేశాల్లో భాగంగా రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థాయి కమిటీ, జిల్లా, జీహెచ్‌ఎంసీ స్థాయిలో పర్యవేక్షణ కమిటీలను ఇదీ వరకే ఏర్పాటయ్యాయి. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేశారు. ఇందులో మూడు కమిటీలకు వేర్వేరు లక్ష్యాలను నిర్దేశించారు.
కమీటీల వారిగా ముఖ్య విధులు
- భూగర్భ జలాల పెంపు, వర్షపునీటి నిల్వకు రాష్ట్రస్థాయిలో అనుసరించాల్సిన విధానాల రూపకల్పన, నీటి పొదుపునకు నిర్దేశించిన పథకాల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, ఈ పథకం విజయవంతం అయ్యేలా ప్రగతి సూచికలు రూపొందించడం మొదలైన బాధ్యతలను రాష్ట్ర స్థాయి ఉన్నత కమిటీలకు అప్పగించారు.
- కొత్త, పాత భవనాలు అన్నింటిలోనూ ఇంకుడుగుంతల నిర్మాణాలు చేపట్టడం, సహజ సిద్ధమైన చెరువులు, చెరువు కుంటల వంటి వాటిని సంరక్షించి పునరుద్ధరించడం, అనధికారికంగా బోర్లు తవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవడం భూగర్భ, ఉపరితల జలాల వాడకాన్ని పరిమితంగా వాడటం తదితరాలను జిల్లా కమిటీలకు నిర్దేశించారు.
- నీటి నియంత్రణ విధానాలు పాటించని వారికి జరిమానా విధించడం, గృహ, వ్యాపార, పారిశ్రామిక భవనాల్లో వర్షపునీటి నిల్వను తప్పకుండా పాటించేలా చూడటం, వర్షపునీటిని సమర్థంగా ఒడిసిపడుతున్న వారిని గుర్తించి ప్రభుత్వం తరఫున మంచి ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి కార్యక్రమాల అమలును జీహెచ్‌ఎంసీ స్థాయి పర్యవేక్షణ కమిటీలకు అప్పగించారు.
రాష్ట్ర స్థాయి ఉన్నత కమిటీ చేయాల్సిన పనులు
- భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు వర్షపునీటిని ఒడిసి పట్టడానికి రాష్ట్రస్థాయిలో అనుసరించే విధానాలను రూపొందించి సమర్థంగా అమలు చేయడం
- నీటి పొదుపునకు సంబంధించి ప్రాథమిక ముసాయిదాను రూపొందించడం, ఇప్పటికే ఉన్న చట్టాలకు అవసరం మేరకు సంస్కరణలు చేపట్టడం
- రాష్ట్రంలోని అన్నీ జిల్లాలకు ఒకే విధమైన పద్ధతులు అనుసరించేలా చూడడం
- వ్యవసాయ, భూగర్భజలాల, పట్టణాభివృద్ది శాఖలు, హైదరాబాద్ మున్సిపల్ వాటర్ అండ్ సీవరేజ్ బోర్డు, రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ, విద్యాశాఖ వంటి వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగడం
- నిధుల, సాంకేతిక సాయం కోసం కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల పూర్తి స్థాయిలో సద్వినియోగ పరుచుకోవడం
- నీటి పొదుపునకు నిర్దేశించిన పథకాల పురోగతిపై నిరంతరం పర్యవేక్షించడం
- ఈ పథకం విజయవంతం అయ్యేలా ప్రగతి సూచికలు రూపొందించి అమలు చేయడం
- భూగర్భ జలాల పర్యవేక్షణ, వర్షపు నీటిని ఒడిసిపట్టడంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, విద్యాసంస్థలు, మీడియా, స్వచ్ఛంద వంటి సంస్థలతో సమన్వయం చేసుకోవడం
- వాల్టాతో పాటు ఇతర చట్టాలను పారదర్శకంగా అమలు చేయడం
- సమయానుకూలంగా మార్గదర్శకం చేయడంతోపాటు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించడం
- జిల్లా స్థాయి పర్యవేక్షణ (వాచ్‌డాగ్) వంటి కమిటీలు.
- జిల్లా అవసరాలకు తగ్గట్టుగా ప్రతిపాదించిన నీటి పొదుపు పథకాలను వేగంగా చేపట్టడం
- జిల్లాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా నీటి నిర్వహణ పద్ధతులపై దృష్టి పెట్టడం
- భూగర్భ జలాల నిల్వలు, నాణ్యతను పర్యవేక్షించేలా మానిటరింగ్ కేంద్రాల ఏర్పాటు
- భూగర్భ జలాలు తీవ్రంగా క్షీణిస్తున్న ప్రాంతాలను గుర్తించి సమస్య తీవ్రతను తగ్గించడం
- స్థానికుల సహకారంతో నీటి పొదుపు చర్యలను వీలైనంత వేగంగా అమలు చేయడం
- ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో భారీ స్థాయిలో ఇంకుడుగుంతలు తప్పనిసరిగా నిర్మించడం
- అనధికారికంగా బోర్లు తవ్వకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం
- భూగర్భ, ఉపరితల జలాల వాడకాన్ని అవసరాల మేరకే వినియోగం
- నీటి పొదుపునకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలను చైతన్యపరచి, అమలు చేయడం
- ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రభుత్వ సహకారం అందించడం
- నీటి నియంత్రణ పద్ధతులపై దశల వారీగా నివేదికలు రూపొందించడం
- నీటి పొదుపు పథకాలను మరింత మెరుగుపరిచేందుకు స్థానికుల సలహాలు స్వీకరించడం
- ఇప్పటికే ఉన్న ఇంకుడు గుంతల పనితీరును మెరుగు పర్చడం
- అవసరమైన చోట కొత్త ఇంకుడు గుంతల నిర్మాణం
- కొత్త పాత భవనాలన్నింటిలోనూ ఇంకుడుగుంతలు నిర్మాణాలు చేపట్టేలా చూడడం
- సహజసిద్ధమైన చెరువులు, కుంటలను సంరక్షించి పునరుద్ధరించడం.
- నీటి వనరులను ఆక్రమణలకు గురికాకుండా చేయడంతో పాటు కలుషితం కాకుండా తక్షణ చర్యలు.
- వ్యవసాయ, పారిశ్రామిక, గృహ అవసరాలకు రీసైకిల్ చేసిన నీటిని వాడుకునేలా అవగాహన.
- అన్ని బోర్లు రికార్డుల్లో నమోదయ్యేలా చూడటంతో పాటు కొత్తగా తవ్వకాలను నియంత్రించడం.
- అడవుల నరికివేతలపై కఠిన చర్యలు చేపడుతూ, పర్యావరణాన్ని కాపాడటం.
జీహెచ్‌ఎంసీ స్థాయి పర్యవేక్షణా కమిటీ
- నీటి వృథాను తగ్గించి, యాజమాన్య పద్ధతులను మెరుగుపరచడం.
- పట్టణాభివృధ్ధిలో భాగంగా ప్రజలు నీటి పొదుపు చేసేలా చూడటం.
- అన్ని కొత్త, పాత నిర్మాణాల్లో ఇంకుడుగుంతల నిర్మాణాలు ఉండేలా చూడటం.
- ఇప్పటికే ఉన్న నీటి వసతులను అవసరాల మేరకు పునరుద్ధరించడం.
- వర్షపునీటిని అన్ని రకాల నిర్మాణాలకు వాడటంతోపాటు పొదుపుగా వినియోగించేలా చూడటం.
- ప్రభుత్వ కార్యాలయాల వంటి చోట భారీస్థాయిలో, ఎక్కువ మొత్తంలో ఇంకుడుగుంతలు నిర్మించడం.
- నీటి నియంత్రణ విధానాలు పాటించని వారికి భారీ జరిమానాలు విధించి కట్టడి చేయడం.
- వర్షపునీటి నిల్వను కచ్చితంగా పాటించేలా గృహ, వ్యాపార, పారిశ్రామిక భవనాలను తరచుగా అధికారులు తనిఖీ చేస్తుండటం.
- నీటి నిల్వ పద్ధతులపై పెద్దఎత్తున ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం.
- వర్షపునీటిని సమర్థంగా ఒడిసిపడుతున్న వారిని గుర్తించి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వడం.
- వర్షపునీటి వినియోగం, భూగర్భ జల మట్టాలను ఎప్పటికప్పుడు గణిస్తూ డేటాబేస్ రూపొందించి తదనంతర కాలంలో ఆయా ప్రాంతాల్లో వస్తున్న భౌగోళిక మార్పులు గమనించడం.
- నీటి పొదుపునకు సంబంధించి అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం.
- లక్ష్యాలను సమర్థవంతంగా చేరుకున్న పథకాలను భవిష్యత్తు అవసరాల కోసం రికార్డుల్లో నమోదు చేయడం.
- మూడు నెలలకోకసారి నివేదికలు రూపొందించి రాష్ట్ర కమిటీకి పంపడం.