Warangal Murder Attack Update : ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన దంపతులకు న్యాయం చేయాలని నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి ధర్నా చేస్తున్న కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం దీపిక తల్లిదండ్రుల మృతదేహాలు ఆసుపత్రిలో ఉండగా బాధితురాలు, ఆమె సోదరుడు చికిత్స పొందుతున్నారు.
దాడిలో తల్లిదండ్రులు మృతి : చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో దారుణం చోటు చేసుకుంది. సమీప గ్రామానికి చెందిన మేకల బన్నీ అనే యువకుడు తాను ప్రేమించిన ప్రియురాలి కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఆ దాడిలో అమ్మాయి తల్లి సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి శ్రీనివాస్ నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఆ ఘటనలో అమ్మాయితోపాటు సోదరుడు మదన్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దంపతులిద్దరూ చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బానోతు శ్రీను సుగుణ దంపతుల కుమార్తె అయిన దీపిక, గూడూరు మండలం గుండెంగకి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులను కాదని గతేడాది నవంబర్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయి ఎవ్వరికీ తెలియకుండా వివాహం చేసుకున్నారు. జనవరిలో యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఆ యువతిని తల్లిదండ్రులతో పంపించారు. అప్పటి నుంచి యువతి ఇంటి వద్దే ఉంటూ హనుమకొండలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే సమాచారం తెలుసుకున్న బన్నీ ఉన్మాదిగా మారాడు.
అర్ధరాత్రి యువతి ఇంటికి వచ్చి దాడికి పాల్పడి : ఈ క్రమంలోనే దీపికతో పాటు వారి తల్లిదండ్రులు శ్రీనివాస్, సుగుణపై నాగరాజు కక్ష పెంచుకున్నాడు. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలుసుకున్న బన్నీ, బుధవారం అర్ధరాత్రి కత్తితో దీపిక ఇంటికి వచ్చి యువతి తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. విచక్షణరహితంగా కత్తితో పొడిచి ఇద్దరినీ హత్య చేశాడు. అడ్డువచ్చిన వారిని కత్తితో బెదిరించి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి తర్వాత అక్కడ నుంచి పరారైన నిందితుడు బన్నీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.