War Of Words Between BRS, Congress : అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మొదటి సమావేశం రసాభాసగా మారింది. ఛైర్మన్ అరికెపూడి గాంధీ ఆధ్యక్షతన జరిగిన సమావేశానికి 13 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబులు కూడా హాజరయ్యారు. మొదటి సమావేశం కావడంతో పీఏసీ విధివిధానాలపైనే చర్చించారు.
ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ సభ్యులు : సమావేశం ప్రారంభంలోనే పీఏసీ ఛైర్మన్ ఎన్నిక అప్రజాస్వామికమని అది చెల్లదంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. హరీశ్‌రావు పేరు లేకుండా చేశారని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. పీఏసీ ఛైర్మన్‌ను ప్రతిపక్ష నేత సూచించిన వ్యక్తికి ఇవ్వడం సభాసంప్రదాయమని దానికి కాంగ్రెస్ తూట్లు పొడిచిందని మండిపడ్డారు. ఎలక్షన్ కాకుండా సెలక్షన్ చేశారంటూ ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్ నేతలు : బీఆర్ఎస్ పీఏసీ సభ్యుల ఆరోపణలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. పీఏసీ ఎన్నిక అసెంబ్లీ నియమావశి ప్రకారమే జరిగిందని ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వంశీకృష్ణలు పేర్కొన్నారు. పీఏసీ సమావేశం ప్రారంభం కాగానే హిడెన్ ఎజెండాతో స్పీకర్‌పై దురుసుగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. 2018లో కాంగ్రెస్‌కు దక్కాల్సిన పీఏసీ పదవిని సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీకి ఇచ్చారని ఆరోపించారు. పీఏసీ ఛైర్మన్ పదవిపై గత కొన్ని రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య విమర్శలపర్వం కొనసాగడం రాజకీయంగా ఆసక్తిని రేకిస్తోంది.
మేము చాలా సీరియస్‌గా ప్రజాధనం దుర్వినియోగాన్ని బయటకు తీస్తాం. పారదర్శకంగా వ్యవహరిస్తాం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో అధికార పక్షం ప్రతిపక్షంగా ఉండదలుచుకోలేదు ప్రజల పక్షంగా ఉండాలనుకుంటున్నాం. అందుకే అసెంబ్లీ లోపల కానీ బయట గానీ గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపే కార్యక్రమం చేస్తున్నందునే బీఆర్ఎస్ వారు బట్టకాల్చి మామీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. - యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే