Detonators Blast Murder in YSR District : వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం కొత్తపల్లికి చెందిన వీఆర్ఏ నరసింహ, సుబ్బలక్ష్మమ్మ దంపతులు ఇంటి ఆవరణలోని రేకులషెడ్డులో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి సమయంలో మంచం కింద పేలుడు పదార్థాలు పేలాయి. పేలుడు ధాటికి నరసింహ మృతిచెందగా భార్య సుబ్బలక్ష్మమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వివాహేతర సంబంధమే కారణంగా ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామన్నారు. బాబు అనే వ్యక్తి కొంతకాలంగా తన తండ్రితో గొడవలు పడుతున్నాడని మృతుడి కుమార్తె తెలిపారు. ఈ కేసులో అనుమానితులు బాబు, రమేశ్ ఇద్దరూ వేముల సమీపంలోని వేర్వేరు ముగ్గురాయి గనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. సాధారణంగా గనులు పేల్చడానికి జిలెటిన్‌స్టిక్స్, డిటోనేటర్లు, అమ్మోనియా నైట్రేట్ వినియోగిస్తుంటారు.
పేలుడు పదార్థాలు కూలీలకు ఎలా చేరాయనేదానిపై దర్యాప్తు : పేలుడు పదార్థాలను గని యజమాని కనుసన్నల్లోనే కూలీలు పేలుస్తుంటారు. కాగా వీటిని అనుమానితులు ఇళ్లకు ఎలా తెచ్చుకున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గనుల తవ్వకాలకు ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, అమ్మోనియో నైట్రేట్ పులివెందులలోని మ్యాగజైన్ కేంద్రంలో లభిస్తాయి. ప్రభుత్వ లైసెన్స్ పొందిన ఈ మ్యాగజైన్‌ను పులివెందుల వైఎస్సార్సీపీ నేత ఒకరు నిర్వహిస్తున్నారు.
కూలీలు పేలుడు పదార్థాలను అక్కడి నుంచి తీసుకొచ్చారా లేక గని యజమాని కళ్లుగప్పి చోరీ చేశారా అనేదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ముగ్గురాయి గని యజమాని శ్రీనివాసులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆరేళ్ల కిందట కలసపాడు మండలంలోని అక్రమంగా తవ్వకాలు చేస్తున్న గని కోసం తెచ్చిన జిలెటన్ స్టిక్స్, డిటోనేటర్లు పేలి 10 మంది కూలీలు మృతి చెందారు. ఇవన్నీ కూడా పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ నేత మ్యాగజైన్ నుంచి తరలించినట్లు అప్పట్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా కొత్తపల్లిలో జిలెటెన్ స్టిక్స్, డిటోనేటర్లు పేలడం అనుమానాలు రేకెత్తిస్తోంది.