CM Revanth America Tour Investments : తెలంగాణ భవిష్యత్, అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచబ్యాంక్ సంసిద్ధత వ్యక్తంచేసింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధఅంశాలపై దాదాపు గంటసేపు చర్చలుజరిపారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాపు రూపొందించాలని నిర్ణయించారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, స్కిల్‌యూనివర్శిటీ, సిటిజన్ హెల్త్‌కేర్, హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థికసుస్థిరత సహా పలు అంశాలపై చర్చించారు. తాము చేపట్టే ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన అమలుచేసి తీరుతామని అన్నింటిలోనూ అత్యంత పారదర్శకత పాటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, వాటి అమలును వేగవంతం చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణుల బృందం ఏర్పాటు చేయాలనే ఆలోచనలని ప్రపంచబ్యాంకు బృందంతో పంచుకున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డితో ఫార్మా ప్రతినిధుల చర్చలు : రాష్ట్రంలో ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీకేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కార్నింగ్ ఇన్‌కార్పొరేటెడ్ సంస్థ ప్రకటించింది. ఔషధాల ప్యాకేజింగ్ కోసం ఉపయోగించే గ్లాస్ ట్యూబ్‌ల వాణిజ్య ఉత్పత్తి వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఎమర్జింగ్ ఇన్నోవేషన్ గ్రూప్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రోనాడ్ వెర్కీరన్ బృందం చర్చలు జరిపింది. పరిశ్రమల్లో సాంకేతిక ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వంతో కార్నింగ్ కంపెనీ ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కోసం కార్నింగ్ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం, హెదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సహకారంతో డాక్టర్ రెడ్డీస్, లారస్ ఫార్మా నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్‌లోనూ కార్నింగ్ కంపెనీ భాగస్వామ్యం కానుంది.
ఇంజెక్షన్ల తయారీ సంస్థకు ఒప్పందం : ప్రముఖ పార్మా కంపెనీ వివింట్ ప్రతినిధుల బృందం సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపింది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించేలా రూ. 400 కోట్లతో ఇంజెక్టబుల్స్ తయారీకేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వివింట్ ఫార్మా ప్రకటించింది. ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో ఆర్అండ్ డీ కేంద్రం నిర్వహిస్తున్న వివింట్ ఫార్మా అక్కడే ఐదున్నర ఎకరాల్లో ఇంజక్షన్ల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లైఫ్‌సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అవసరమైన రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ అభివృద్దికి దోహదపడే పెట్టుబడులను రాబట్టేలా అమెరికా పర్యటన సజావుగా సాగుతోందని పరిశ్రమలు, ఐటీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. పదేళ్లుగా రాష్ట్రం తరఫున గ్లోబల్ లీడర్స్‌తో ఒప్పందాల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో మరో 6 రోజులపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం చర్చలు జరపనుంది.