AP Rains Latest Update : వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్టణం, కాకినాడ తీరాల్లో పెద్ద ఎత్తున సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. అలాగే రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, గుంటూరు, ఉమ్మడి నెల్లూరు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో కొన్ని చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్ వద్ద అలలు దుకాణాలను తాకుతున్నాయంటే వాయుగుండం ఎఫెక్ట్ ఎంత భీకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షానికి విశాఖ జిల్లాలోని పెదగంట్యాడ మండలం కొంగపాలెంలో రేకుల షెడ్డు కూలిపోయి ఓ వ్యక్తికి గాయాలు అయ్యాయి.
కాకినాడ తీరం అల్లకల్లోలం : కాకినాడలోని ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇక్కడ అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, ఇళ్లు, చెట్లు నేల కూలాయి. అలాగే అంతర్వేది తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. గోదావరి సంగమం వద్ద అలలు ఉద్ధృతంగా ఉన్నాయి. పల్లిపాలెంలో బీచ్ రోడ్డు, ఇళ్లును అలలు ముంచెత్తాయి. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు తీరంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడగా, ఓఎన్జీసీ ప్లాంటును సముద్రపు నీరు తాకింది. ఆక్వా చెరువుల్లో సముద్రం నీరు ముంచెత్తింది.
తిరుపతి జిల్లా తడ వద్ద తీరం దాటిన వాయుగుండం : వాయుగుండం తిరుపతి జిల్లా తడ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. 22 కిలోమీటర్ల వేగంతో కదిలి గడిచిన ఆరు గంటల్లో తీరాన్ని తాకినట్లు వెల్లడించింది. అనంతరం వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
జలాశయాలకు చేరుతున్న వరద నీరు : శ్రీసత్యసాయి జిల్లాలోని చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వెల్దుర్తి, గంగినేపల్లి తండాలకు, ఎర్రోనిపల్లి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వైఎస్సార్ జిల్లాలో గండికోట జలాశయం, మైలవరం జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది. వైఎస్సార్ జిల్లాలోని పైడిపాలెం, వామికొండ, సర్వారాయ సాగర్ జలాశయాలకు వరద వచ్చి చేరుతోంది. నెల్లూరు నగర శివారులోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. వర్షపు నీరు రహదారులపై నిలిచిపోయింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పంటలు తడిసిపోయాయి. మొక్కజొన్న, వేరుశనగ రైతులకు నష్టం వాటిల్లింది.
వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష : రాష్ట్రంలో వర్షాలపై కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లా కలెక్టర్లకు ప్రస్తుత పరిస్థితిని వివరించారు. అలాగే ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడినట్లు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రవాహాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, చెరువులు పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నీటి నిర్వహణ, సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రవాహాలపై చర్యలను అధికారులకు సీఎం చంద్రబాబు వివరించారు.
సీమ జిల్లాల్లో జోరు వానలు - జలమయమైన పలు ప్రాంతాలు
వర్షం ఎంత కురిసిందో ఎలా తెలుస్తుంది? - ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లకు అర్థం తెలుసా?