Lagacharla Villagers About Pharma City : తెలంగాణలోని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఇటీవల జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ ఫార్మాసంస్థ భూసేకరణ కోసం గ్రామసభ నిర్వహించేందుకు వచ్చిన కలెక్టర్, ఇతర రెవెన్యూ సిబ్బంది వాహనాలపై స్థానికులు దాడి చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
అధికారులపై దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఘటన జరిగినట్లుగా అనుమానిస్తోంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో లగచర్ల గ్రామస్థులు స్పందించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఫార్మా కంపెనీ వద్దు - మా భూములే ముద్దు : 'ఫార్మా కంపెనీ మాకొద్దు, మా భూములే కావాలి' అని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామస్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ గ్రామంలోకి ఫార్మా కంపెనీ వస్తుందని ప్రచారం జరిగిందని, దీంతో తమ భూములను కోల్పోతామని భయం కలిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు గ్రామల రైతుల నుంచి సర్కారు 1300 ఎకరాల భూములను తీసుకుని ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలని ఆలోచన చేసిందని వారు తెలిపారు.
భారీగా మొహరించిన పోలీసులు - ఇంటర్నెట్ బంద్ - 55 మంది గ్రామస్థుల అరెస్ట్
"లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు వల్ల మా భూములు పోతాయి. అందుకే మేము పోరాటం చేస్తున్నాం. వాటిలోనే పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నాం. కలెక్టర్ మా గ్రామానికి వస్తున్నారని మాకు తెలియదు. ఎవ్వరిపైనా మేము దాడి చేయలేదు. ఒక వేళ మాకు ఆ విషయం తెలిసి ఉంటే మేము ఆయనతో మాట్లాడేవారం. మాకు ఫార్మా వద్దు. మా బతుకులు ఏదో మేము బతుకుతున్నాం"- లగచర్ల గ్రామస్థులు
ఫార్మా కంపెనీ వస్తే మాకు జీవనోపాధి ఉండదు : వికారాబాద్ జిల్లా కలెక్టర్,అధికారుల బృందంతో ప్రజా అభిప్రాయ సేకరణ కోసం వస్తున్నారని తమకు తెలియదని లగచర్ల గ్రామస్థులు వెల్లడించారు. లగచర్ల గ్రామానికి చెందిన వారెవరూ అధికారులపై దాడి చేయలేదని గ్రామస్థులు వివరించారు. ఫార్మా కంపెనీ వస్తే తమకు జీవనోపాధి ఉండదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాళ్లు, కర్రలతో తిరగబడ్డ రైతులు - కలెక్టర్, తహశీల్దార్ కార్ల అద్దాలు ధ్వంసం