Charisma of Vijayawada Won International Medal in Germany Badminton : ఎప్పుడూ హుషారుగా గెంతులు వేస్తుందని బ్యాడ్మింటన్‌లో చేర్పించాడు తండ్రి. తనకు ఉన్న జోష్ అంతా ఆటలో కనపరిచింది ఆ అమ్మాయి. ఎనిమిదేళ్ల వయస్సులో రాకెట్ పట్టిన ఆ చిన్నారి నేడు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనపరిచి కాంస్య పతకాన్ని సాధించి విజయ బావుటా ఎగురవేసింది. పేరుకు తగ్గట్లుగా తన చరిష్మాతో అందరిని మెప్పిస్తుంది విజయవాడ వాసి సూర్య చరిష్మా.
విజయవాడకు చెందిన సూర్య చరిష్మా తండ్రి నవీన్ స్వర్ణకారుడు. రోజూ బ్యాడ్మింటన్ ఆడేందుకు స్టేడియంకు వెళ్తుంటారు. చరిష్మాకు ఉన్న ఉత్సాహం చూసి ఆమెకు ఆట నేర్పించాలని తండ్రి నిర్ణయించుకున్నారు. ఎనిమిదేళ్ల వయసులో ఆటలో ఆరంగేట్రం చేసిన చరిష్మా కరోనా ముందు వరకు సాధారణ క్రీడాకారిణిగా ఉండేది. కరోనా సమయంలో సైతం శాప్ కోచ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఆన్ లైన్లో కోచింగ్ తీసుకుంది. ఆటలో మెళుకువలు నేర్చుకుంది.
కరోనా అనంతరం నిత్యం కఠోర దీక్షతో సాధన చేసింది. ఈ యేడాది జనవరిలో హైదరాబాద్‌లో జరిగిన అండర్ 19 ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బాడ్మింటన్ టోర్నమెంట్లో బంగారు పతకం సాధించింది. ఈ యేడాది చెన్నైలో జనవరిలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో బంగారు పతకం కైవసం చేసుకుంది. గతేడాది డిసెంబర్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పసిడి పతకం సాధించింది.
ఈ యేడాది మార్చిలో జర్మనీలో జరిగిన అంతర్జాతీయ మహిళల సింగిల్స్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం కైవసం చేసుకుంది. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన జూనియర్ జాతీయ స్థాయి పోటీల్లో కాస్యం, గోవాలో జరిగిన జాతీయ పోటీల్లో కాంస్యం గెలుకుని సత్తా చాటింది. ప్రస్తుతం అండర్ 19 విభాగంలో రెండో ర్యాంకు స్థానాన్ని సంపాదించింది చరిష్మా. జర్మనీకి వెళ్లిన బృందంలో మెడల్ సాధించి తన ప్రతిభను చాటింది. దీంతో పాటు రాష్ట్ర స్థాయిలో15 కు పైగా బంగారు పతకాలు సాధించింది. చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ అంటే ఎంతో ఇష్టమని చరిష్మా చెబుతోంది.
'కరోనా సమయంలో చాలా కష్టపడ్డాను. చిన్నప్పటి నుంచి నాకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. అది గమనించిన మా అమ్మానాన్న నన్ను ప్రోత్సహించారు. సరైన సౌకర్యాలు లేకపోయినా ప్రాక్టీస్ ఆపలేదు. జర్మనీలో పతకం సాధించడం చాలా ఆనందంగా ఉంది. కోచ్ భాస్కర్, తల్లిదండ్రుల సహకారం వల్ల ఈ విజయాలు సాధ్యమయ్యాయి.' - సూర్య చరిష్మా ,బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
విజయవాడ విలుకాడు- శిక్షణ ప్రారంభించిన అనతి కాలంలోనే పతకాల పంట - Archery champion Trinath
'మా కుమార్తె అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించటం చాలా సంతోషంగా ఉంది. మొదటి నుంచి ఆటలో చేసే పొరపాట్లను ఎప్పటి కప్పుడు దిద్దుకుంటూ ఉండటం వల్లే ఈ స్థాయికి చేరుకుంది. శాప్ కోచ్ భాస్కర్ చాలా నిశితంగా పరిశీలించి ఆట తీరు మెరుగుపరిచేందుకు సూచనలు చేస్తుంటారు. జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో బహుమతులు సాధించింది. ప్రభుత్వం నుంచి సహకారం ఉంటే మరిన్ని పతకాలు గెలుస్తుందన్న నమ్మకం ఉంది.' - తండ్రి నవీన్
కరాటేలో బెజవాడ కుర్రాడి సత్తా - అంతర్జాతీయంగా 6 స్వర్ణ పతకాలు కైవసం - Ranadhir Excelling in Karate
'బాడ్మింటన్ క్రీడాకారులకు అకాడమీ ఏర్పాటు చేసి శిక్షణనిప్పిస్తే ఖచ్చితంగా మెరుగైన క్రీడాకారులు తయారవుతారు. పోటీలకు వెళ్లాలంటే చాలా ఖర్చు అవుతుంది. దాతలు ఆర్ధిక సాయం చేసేందుకు ముందుకు వస్తే బాగుంటుంది. 30 మంది చిన్నారుల్లో ఉత్సాహంగా ఆడుతున్న సూర్య చరిష్మాను గమనించాను. అలసట లేకుండా ఎక్కువ సమయం ఆడగలిగే స్టామినా చరిష్మాలో ఉంది.' -భాస్కర్ ,శాప్ కోచ్
బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ఖేలో ఇండియా ద్వారా తక్కువ ఆర్ధిక సాయం అందుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . విజయవాడలో ప్రభుత్వం బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కోచ్ కోరుతున్నారు. మౌళిక సదుపాయాలు పెంచి ప్రోత్సాహకాలు అందిస్తే క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తారని చెబుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ - తైక్వాండోలో రాణిస్తున్న విజయవాడ అమ్మాయి - Taekwondo pavani sai