Vijayawada People Facing Water Problems: ఎండాకాలం రాకముందే విజయవాడ నగర వాసులకు తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. అలాంటిది ఎండాకాలం వచ్చే సరికి విజయవాడ నగరవాసులు ఏడారి పరిస్థితులకు అవకాశం ఉందనే భావన కలుగుతోంది. తమకు తాగునీరు అందడం లేదని నగరవాసులు రోడ్లపైకి చేరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పారిశుద్ధ్య పనులు ఆగిపోయి మురుగుకంపు భరించలేకున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత పక్షం రోజుల క్రితం తాగునీటి కోసం రోడ్డెక్కిన జక్కంపూడి మహిళల సమస్యలను టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామాహేశ్వర రావు అడిగి తెలుసుకున్నారు. నగరవాసులకు తాగునీరు అందించలేని స్థితికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేరుకుందని దుయ్యబట్టారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
50 వేల జనాభాకు వారానికి ఒకసారే నీళ్లు - అవస్థలు పడుతున్న ప్రజలు
ప్రజలకు తాగునీరు కూడా అందించలేని దుస్థితిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. విజయవాడ నగర శివారులోని జక్కంపూడి కాలనీలో తాగునీరు అందక, గత నెల రోజులుగా పడుతున్న ఇబ్బందులను దేవినేని పరిశీలించారు. కాలనీలో తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు మాత్రమే కాకుండా మరిన్ని సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు మహిళలు వివరించారు.
కాలనీల్లో పారిశుద్ధ్య పనులు అధ్వాన్నంగా ఉన్నాయని, మంచినీటికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు దేవినేనికి వివరించారు. రాత్రి సమయంలో వీధిలైట్లు లేవని, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ వల్ల ప్రాణ భయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని మహిళలు దేవినేనికి మొర పెట్టుకున్నారు. దీనిపై దేవినేని స్పందిస్తూ, సంఘావిద్రోహక శక్తుల వల్ల మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యలు ఎదుర్కోంటున్నారని, అధికారులు తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
నాలుగున్నరేళ్లుగా పూర్తికాని పనులు - తాగునీటి కోసం అనకాపల్లి వాసుల వెతలు
పెడన నియోజకవర్గంలోని కృతివెన్ను మండల చిన పాండ్రకా గ్రామస్థులు తాగునీటి కోసం రోడ్డెక్కారు. రోడ్డుపై బెఠాయించి ఆందోళన నిర్వహించారు. ఓఎన్జీసీ ఏర్పాటు సమయంలో ఇచ్చిన తాగునీటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఓఎన్జీసీ అధికారులను ఎన్నిసార్లు కలిసినా, స్పందన లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసీ రాక ముందు తమకు తాగునీరు, సాగునీరు పుష్కలంగా ఉండేదన్నారు. ఇది ఏర్పాటైన తర్వాత వాయ్యు కాలుష్యం పెరిగిపోతోందని, గ్రామంలో తాగునీరు, రోడ్ల వసతి కల్పించలేని ఓఎన్జీసీ తమకు వద్దని గ్రామస్తులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.