Vijayawada Hilly Areas People Facing Difficulties due to No House Rights : విజయవాడ నగరంలో దశాబ్ధాలుగా ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న వాళ్లకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంత మందికి 1981లో బీఫామ్ పట్టాలు మంజూరు చేసినా నేటికీ రిజిస్ట్రేషన్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇళ్ల రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని ఆశచూపి ఓట్లు వెయ్యించుకుందని ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో తమ ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయలేదని మండిపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వమైనా ఇళ్లు పట్టాలు లేని వాళ్లకి పట్టాలు, ఇళ్ల పట్టాలు మంజూరైన వాళ్లకి రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
నగరవాసులకు నెరవేరని ఇళ్లపట్టాల కల : విజయవాడలో కొండ ప్రాంతాలైన మొగల్రాజపురం, వన్ టౌన్ లోని పలు కాలనీల ప్రజలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరితో పాటు కృష్ణానది పరివాహక ప్రాంతాలైన రామలింగేశ్వర నగర్లోని కొన్ని ప్రాంతాలు, భూపేశ్ గుప్తా నగర్, తారకరామా నగర్, రణదివే నగర్, గాంధీ కాలనీ వంటి ప్రాంతాల్లో దశాబ్ధాలుగా నివాసం ఉంటున్న ప్రజలకు ఇళ్లు పట్టాలు మంజూరు చేయలేదు. ఎన్నికల సమయంలో తమ ఇళ్లకి రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చి ఓట్లు వెయ్యించుకుని అధికారంలోకి వచ్చాక తమ సమస్యకు పరిష్కారం చూపించడం లేదని ఆయా ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. కృష్ణానది పక్కనే జీవిస్తున్న ప్రజల ఇళ్లు గత కొన్నేళ్ల క్రితం వరకు భారీ వర్షాలు కురిసే సమయంలో ముంపునుకు గురయ్యేవి. ప్రస్తుతం రక్షణ గోడ నిర్మించడంతో చాలా వరకు ఆ సమస్య లేదు. తాము గత నలభై ఏళ్లుగా నివాసం ఉంటున్నా ఇళ్ల పట్టాలు మాత్రం మంజూరు చేయడం లేదని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఇంటి పన్ను, విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నా ఇంటి పట్టాలు ఇవ్వకపోవడం దారుణమంటున్నారు. వీళ్లతో పాటు ఏలూరు, బందరు, రైవస్ కాలువలకు ఆనుకుని అనేక మంది చిన్నాపాటి ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. వాళ్లకీ పట్టాలు మంజూరు కాలేదు.
ఏన్టీఆర్ హయాంలో పలువురికి ఇళ్లపట్టాలు పంపిణీ : మొగల్రాజపురం, వన్ టౌన్ ఏరియాలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న పలు కాలనీల ప్రజలకి 1981 ప్రాతంలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఈ ప్రాంత ప్రజలకు గత కొన్నేళ్లుగా ప్రైవేటు బ్యాంకుల వాళ్లు ఇళ్ల పట్టాలు తనఖా పెడితే లక్షా యాభై వేల వరకు రుణాలూ ఇచ్చేవి. ప్రస్తుతం రుణాలు ఇచ్చే వారి సంఖ్య తగ్గించారు. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో అధిక శాతం మంది రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు. తమ ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా మంది ఖాళీ ప్రాంతాల్లో చిన్నపాటి ఇళ్లు, రేకుల షెడ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. వాళ్లకి ఎవరికీ ఇళ్ల పట్టాలు లేవు. గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల లబ్ధిదారులూ చాలా మంది ఇళ్లు ఇతరులకు అమ్మివేశారు. తక్కువ ధరకి ఇళ్ల స్థలం వస్తుంది కదా అని చాలా మంది కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఈ ఇళ్లల్లో నివాసం ఉంటున్న వాళ్లకి పట్టాలు లేవు.
"దశాబ్ధాలుగా ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేదు. కొందరికి గతంలో బీఫామ్ పట్టాలు మంజూరు చేసినా నేటికీ రిజిస్ట్రేషన్లు కాలేదు. గత ప్రభుత్వం ఇళ్ల రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని ఆశచూపి ఓట్లు వెయ్యించుకుని మోసం చేసింది. ఇళ్లు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకొవడానికి కుదరడం లేదు. కూటమి ప్రభుత్వమైన ఈ సమస్యపై దృష్టి పెట్టి పరిష్కరిచాలి." - బాధితులు
సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి : వాస్తవంగా అయితే బీఫామ్ పట్టాలు మంజూరు చేసిన ఇళ్లను అమ్మకూడదు. అయితే కుటుంబ అవసరాలు, ఉపాధి రిత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయే వాళ్లు ఇళ్లు కొంత మొత్తానికి అమ్మివేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఇదే అదునుగా చూసుకుని చాలా మంది చోటా నాయకులు కొండలను సైతం చదును చేసి స్థలాలు అమ్మకానికి పెట్టారు. అయితే ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ల ఇళ్లు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో కుటుంబ అవసరాలుకు తనఖా పెడదామన్నా కుదరడం లేదని స్థానికులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ అయితే ఇళ్ల పత్రాలు పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కొన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తాము నివాసం ఉంటున్న ఇళ్లకు పట్టాలు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నలభై ఐదేళ్ల క్రితం బీఫామ్ పట్టాలు మంజూరు చేసిన ఇళ్లుకు రిజిస్ట్రేషన్ చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.