Vigilance Report on Govt Employees Corruption : పదేళ్లలో జరిగిన విజిలెన్స్ విచారణల నివేదికలను సమాచార హక్కు చట్టం ద్వారా ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సేకరించింది. తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయం ప్రభుత్వ ఉద్యోగుల్లో లేకపోవడంతో సామాన్యుడు బలవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగులు విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ శాఖలో వివిధ విభాగాల్లో భూమి విలువను బట్టి లంచం ఉంటుందని గత పదేళ్ల విజిలెన్స్ నివేదికలను విశ్లేషించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అవినీతిపై 1,230 నివేదికలను విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.
2014 నుంచి 2024 మార్చి 31 మధ్య తీవ్ర అవినీతి కేసులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ దర్యాప్తు చేసి నివేదిక అందజేసింది. ఇందులో అత్యధిక అవినీతి కేసులు ఎదుర్కొన్న వాటిల్లో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖకు సంబంధించి 284 కేసులు ఉన్నాయి. రెవెన్యూ 174, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో 142, వ్యవసాయ, సహకారశాఖలో 110, నీటి పారుదలశాఖలో 73, పౌరసరఫరాలశాఖలో 64, పర్యావరణ,అటవీశాఖలో 61, వైద్యారోగ్యశాఖలో 47 కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ నివేదికలను తొక్కిపెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షడు పద్మనాభం రెడ్డి కోరుతున్నారు.
రిపోర్టులు ఇచ్చిన తీసుకోని చర్యలు : ప్రభుత్వంలోని పలుశాఖల్లో పనితీరు మెరుగు పర్చుకోవాలని సూచిస్తూ విజిలెన్స్ విభాగం గతంలో 123 రిపోర్టులు ప్రభుత్వానికి ఇచ్చింది. ఇందులో అత్యధికంగా వ్యవసాయ శాఖపై 20 నివేదికలు ఇచ్చింది. ఆ తర్వాత పురపాలకశాఖపై 17 నివేదికలు ఇచ్చింది. అలాగే భారీ అవకతవకలను విశ్లేషించిన విజిలెన్స్ విభాగం 768 నివేదికలను ప్రభుత్వానికి ఇచ్చింది. ఇందులో పురపాలక శాఖలో 143 నివేదికలుండగా పౌరసరఫరాల శాఖలో 122, పంచాయతీ రాజ్‌లో 80, నీటిపారుదల శాఖలో 59, వ్యవసాయశాఖలో 52 ఉన్నాయి.
అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకోబోతున్నారంటూ గత పదేళ్లలో 1,215 అప్రమత్తత నివేదికలను విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో 232 నివేదికలతో రెవెన్యూ శాఖ ముందువరుసలో ఉండగా పురపాలక శాఖ 189, కార్మిక, ఉపాధిశాఖలు 183 నివేదికలతో ఆ తర్వాత వరుసల్లో ఉన్నట్లు సమాచారం. చాలా ఉదంతాల్లో విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి అందించినా ప్రభుత్వం చర్యలు మాత్రం తీసుకోవట్లేదని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభం రెడ్డి వెల్లడించారు.
జీహెచ్ఎంసీ మాజీ ఉద్యోగి వద్దే లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిల్ కలెక్టర్ - Bill collector Bribe case