Kidnapped for Money: వారిద్దరూ వైఎస్సార్సీపీ నేతలు. ఒకరికొకరికి బాగా పరిచయం ఉంది. దీనిని అదనుగా తీసుకొని ఒకరు మరో వ్యక్తిని డబ్బుల కోసం కిడ్నాప్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా వ్యక్తి చేతులు కట్టేసి కారులో శివారు ప్రాంతానికి తీసుకెళ్లి చంపేందుకు యత్నించాడు. అప్పుడే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నల్లపాడులో జరిగింది.
గుంటూరు జిల్లా నల్లపాడులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కలకలం నెలకొంది. వైఎస్సార్సీపీకి చెందిన ఇమడాబత్తిన నాగేశ్వరరావు అనే వ్యక్తిని అదే పార్టీకి చెందిన మిరపకాయల వ్యాపారి దుగ్గెం నాగిరెడ్డి కిడ్నాప్ చేశాడు. 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితుడు తన దగ్గర అంత డబ్బు లేదని చెప్పడంతో అడిగిన సొమ్ము ఇవ్వకపోతే చంపేస్తానని భౌతిక దాడి చేశాడు.
Victim Safely Escaped: నేను, దుగ్గెం నాగిరెడ్డి వైఎస్సార్సీపీ పార్టీకి చెందినళ్లే. మాకు బాగా పరిచయం కూడా ఉంది. ఆ పరిచయంతోనే నాగిరెడ్డి వచ్చి కారు ఎక్కమనగానే ఆలోచించకుండా కారు ఎక్కినట్లు బాధితుడు నాగేశ్వరరావు తెలిపారు. నల్లపాడు నుంచి పేరేచర్ల కైలాసగిరి వైపు తీసుకెళ్లి 2 కోట్ల రూపాయలు కావాలని నాగిరెడ్డి డిమాండ్ చేశాడని వెల్లడించారు. డబ్బులు లేవని బదులివ్వడంతో తనపై దాడి చేసి కొట్టడమే కాకుండా చంపేస్తానని బెదిరించారన్నారు.
కైలాసగిరి కొండ మీదకు తీసుకెళ్లి చంపేందుకు ప్రయత్నించగా కొండ మీద నుంచి కింద పడి తప్పించుకున్నట్లు నాగేశ్వరరావు వెల్లడించారు. స్థానికుల సాయంతో అక్కడి నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. నాగిరెడ్డితో ఎలాంటి వ్యాపారాలు, లావీదేవీలు, గొడవలు లేవని, కేవలం డబ్బు కోసమే తనను కిడ్నాప్ చేశాడని నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
నాగిరెడ్డి వచ్చి అన్నా రా అంటే కారు ఎక్కాను. తెలిసినోడు అని కారు ఎక్కా. అతను మిరపకాయల వ్యాపారి. ముందు డబ్బులు కావాలని అడిగాడు. నాదగ్గర డబ్బులు ఎక్కడివి అని అన్నాను. వ్యాపారం బాగా చేస్తున్నావు. నీ దగ్గర డబ్బులుంటాయి అన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానన్నాడు. కారులో కైలాసగిరి కొండమీదికి తీసుకెళ్లాడు. నేను ఎంతటివాడిని, నా దగ్గర డబ్బులు ఎక్కడివి అన్నా వినకుండా కొండపైకి తీసుకెళ్లాడు. నా చేతులు వెనక్కి కట్టేసి చంపేందుకు యత్నించాడు. నేను అతి కష్టం మీద కొండ మీది నుంచి కింద పడి తప్పించుకున్నాను. ఓ వ్యక్తి నా గొంతు విని రక్షించాడు. -ఇమడాబత్తిన నాగేశ్వరరావు, బాధితుడు
ప్రియుడిని కిడ్నాప్ చేసేందుకు పెళ్లైన ప్రియురాలు ప్లాన్ - కానీ చివరికి ఏమైందంటే!