Very Rare Fish Ramala : భార్య పుస్తెలు అమ్మైనా పులస చేప తినాలనే నానుడి ఉంది. ఎందుకంటే పులస అంత రుచిగా ఉంటుంది మరి. ఒక్కసారి ఈ చేపను తింటే జీవితానికి ఇది చాలు అనుకునే వాళ్లు చాలామందే ఉంటారు. ఒక్క పులస దొరికిందంటే, ఆ మత్స్యకారుడికి ఆరోజు కాసుల పంట పడినట్లే! అదేస్థాయిలో రుచిని అందించే మరో చేప కూడా ఉందండోయ్. అదే 'రామ చేప'. ఇప్పుడు రామ చేపలకు మార్కెట్లో డిమాండ్ భారీగానే ఉందంటే నమ్మగలరా? అసలు ఏంటి ఈ రామ చేపలు? ఎప్పుడూ వినలేదే అని అనుకుంటున్నారా? ఈ చేపలు ఎక్కడ దొరుకుతాయి? వాటి కథేంటో తెలుసుకుందాం పదండి.
రామ చేపలు చూడటానికి బొమ్మిడాయిల మాదిరిగా ఉండి, అచ్చం పులస చేప టేస్టీనే ఉంటుంది. కానీ ఇవి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉప్పుటేరు పరివాహక ప్రాంతాల్లో కేవలం రెండు, మూడు నెలలు మాత్రమే దొరికే చేపలు. వీటి కోసం మాంసాహార ప్రియులు ఎగబడుతుంటారు. ఇవి దీపావళికి ముందు నుంచే లభ్యమవుతాయి. డిసెంబర్ వరకు మాత్రమే దొరుకుతాయి. ఈ చేపలు 5 నుంచి 6 అంగుళాలు ఉంటాయి. అయితేనేం రుచి తెలిస్తే మాత్రం ధరను అసలు లెక్క చేయకుండా కొనేస్తారు.
ఈ ప్రాంతాల్లో మాత్రమే ప్రత్యేకంగా పెరుగుతాయి : కార్ప్ అనే చేప జాతికి చెందిన ఈ రామలు శాస్త్రీయ నామం లేబియో రోహితా. పశ్చిమ గోదావరి పరివాహక ప్రాంతాల్లో వీటిని రావలు, రావా, రావల చేపగా పిలుస్తారు. ఈ చేపలు పశ్చిమ గోదావరి జిల్లాలోని సముద్ర తీరం ఎగువ ప్రాంతంలో ప్రవహించే ఉప్పుటేరులోకి బొండాడ, గొంతేరు, యనమదుర్రు తదితర కాలువలు కలిసే ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఉప్పుటేరులో ప్రవాహ వేగం తగ్గిన తర్వాత కాస్త ఉప్పు, చప్పటి నీరు కలిసి ఉండే ఏర్లలో ఇవి దొరుకుతాయి. అందుకే వీటికి అంత రుచి. సహజంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మాత్రమే రామల చేపలు దొరుకుతాయి.
రామల చేపలకు డిమాండ్ : రామల చేపలు సగటున కిలోకు 40 వరకు తూగుతాయి. కానీ వీటిని మాత్రం కిలోల లెక్కన లెక్కించరు. సాధారణ రోజుల్లో రామలు ధర ఒక్కోటి రూ.25 వరకు ఉంటుంది. కానీ దీపావళి ముందు రోజుల్లో సీజన్ ప్రారంభంలో ఒక్కోటి రూ.30కు పైనే పలుకుతుంది. ఈ చేపలను ఎక్కువగా కొన్నేళ్లుగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. వీటికి ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని భీమవరం మండలం చెరువుల్లో చేపలను సాగు చేస్తున్నారు. మే నెలాఖరు నాటికి సీడ్ వేస్తే 5 నుంచి 6 నెలల పాటు వీటిని జాగ్రత్తగా పెంచుతారు. గతం సీడ్ ధర రూ.25 పైసలు ఉంటే ఇప్పుడు రూ.3కు చేరింది. సీజన్లో ఒక్కసారైనా రామలు తినాలని మాంసాహారులు చెబుతారు.
కిలోన్నర చేపకు రూ.24 వేలు - 'పులస' అంటే ఆమాత్రం రేటు ఉంటది మరి! - Pulasa Fish Rate in Godavari
ఒక్క చేప రూ. 2 లక్షలు - పులస కూడా కాదండీ.. ఆయ్! - 2 KACHIDI FISH COST 4 LAKH RUPEES