Venkatagiri Poleramma Jatara in Tirupati District : తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగిన పోలేరమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో జాతరను నిర్వహించారు. ముందుగా చాకలి మండపంలో అమ్మవారి ప్రతిమకు పసుపు కుంకుమలతో సారె సమర్పించారు. శోభా యాత్రలో భాగంగా ప్రత్యేక పూలరథంలో నడివీధి నుంచి ఆలయానికి అమ్మవారిని తీసుకొచ్చారు.
ప్రత్యేక పూల రథంలో అమ్మవారి శోభా యాత్ర : వెంకటగిరి పోలేరమ్మ జాతరలో కీలక ఘట్టమైన అమ్మవారి విగ్రహం తయారీ బుధవారం సాయంత్రానికి పూర్తయింది. అమ్మ పుట్టినిల్లయిన కుమ్మరివీధిలోని కుమ్మరింట అమ్మవారి ప్రతిమను తయారు చేశారు. కుమ్మరి కుటుంబీకులు పోలేరమ్మకు అమ్మగారి సాంగ్యం అందజేశారు. రాజాలు సమర్పించిన పట్టుచీరను అమ్మవారికి అలంకరించారు. విగ్రహం తయారీ పూర్తయ్యాక అమ్మవారిని దర్శించుకునేందుకు ఉంచారు. ఇక్కడ వేలాది మంది భక్తులు పోలేరమ్మను దర్శించుకు న్నారు.
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర - పోటెత్తిన భక్తులు - Poleramma Jatara
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి దుర్గేశ్ : గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలేరమ్మను మెట్టినిల్లైన చాకలింటికి తీసుకు వెళ్లి అక్కడ కళ్లు, దిష్టిచుక్క ఏర్పాటు చేసి కిలారింపులు, దివిటీ వెలుగులు, యువకులు చిందులు మధ్యన అమ్మవారిని చప్పరంపై ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఇక్కడ భక్తుల దర్శనార్థం ఉంచారు. గురువారం సాయంత్రం వరకు భక్తులు పోలేరమ్మను దర్శించుకునేలా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పట్టణంలోని బూసాతోటలో ప్రత్యేకంగా బాణసంచా కాల్చే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. అమ్మవారికి ప్రభుత్వం తరపున పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సారె సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం జాతర నిర్వహణకు రూ.50 లక్షలు ప్రకటించింది.
ఘనంగా ముగిసిన తాతయ్యగుంట గంగమ్మ జాతర- మట్టి కోసం పోటీపడ్డ భక్తులు - GANGAMMA JATARA