Vegetable Prices Hike in Telangana : కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్న చందంగా మారింది కూరగాయల పరిస్థితి. భారీ వర్షాల కారణంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ఇటు వ్యాపారులు అటు కొనుగోలుదారులు కూరగాయలు కొనాలంటే భయపడుతున్నారు. అధిక ధరలు పెట్టి కూరగాయలు కొనుగోలు చేసిన నాణ్యతలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలు చాలా ప్రాంతాల్లో ప్రజలకు నిలువ నీడ లేకుండా చేశాయి. మరికొన్ని ప్రాంతాల్లో పంటలను నీటముంచాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ వానలు సృష్టించిన బీభత్సంతో కూరగాయల పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. డిమాండుకు తగ్గ దిగుబడి లేదని రైతులు అంటున్నారు.
Vegetable Price Today In Telangana : మొన్నటి వరకు శ్రావణమాసం, ఇక ఇప్పుడు వినాయక చవిత సందర్భంగా తెలుగిళ్లలో చాలా మంది శాకాహారానికే ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలో కూరగాయలకు భారీగా డిమాండ్ పెరిగింది. కానీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో డిమాండుకు సరిపడా సరఫరా లేకపోవడంతో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
కొన్ని ప్రాంతాల్లో కూరగాయల ధరలు ఎక్కువగా ఉండటం చూసి వినియోగదారులు అమ్మకందారులతో గొడవలకు దిగుతున్నారు. వర్షాలు పడేకంటే ముందు కిలో బెండకాయ పది రూపాయలకు అమ్ముడుపోతే ఇప్పుడు దాని ధర రూ.70 నుంచి రూ.80 వరకు ఉందని వ్యాపారులు చెబుతున్నారు. వంకాయ అప్పుడేమో రూ.20 ఉంటే ఇప్పుడు రూ.60 ఉందని తెలిపారు. దొండకాయ రూ.60, పచ్చిమిర్చి రూ.80, కిలో కొత్తిమీర రూ.300 వరకు పలుకుతుందని వెల్లడించారు. అమ్మబోతే అడవి కొనబోతె కొరవి అన్న చందంగా తమ పరిస్థితి మారిందని వ్యాపారులు అంటున్నారు.
"నిత్యం మార్కెట్‌కు వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తాం. గత పది రోజులుగాఈ మార్కెట్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి కొనలేకపోతున్నాం. ఏ కూరగాయలు చూసిన ధరలు మండిపోతున్నాయి. వర్షాల కారణంగా కూరగాయలు రావట్లేదని వ్యాపారస్తులు చెబుతున్నారు. సామాన్యులతో పాటు కూలినాలీ చేసుకునేవారు కూరగాయలు కొనుగోలు చేసి వండుకునే పరిస్థితి లేదు." - వినియోగదారులు
వర్షాకాలంలో ఈ కూరగాయలు తింటే ప్రమాదం! ఫుల్ లిస్ట్ ఇదే! - Vegetables To Avoid During Monsoon