Vasireddy Padma Resign: మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు. మహిళల సాధికారత కోసం అన్ని చర్యలు తీసుకున్నా ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తాను మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో పార్టీ కోసం పని చేస్తానని వెల్లడించారు.
మహిళల సాధికారత కోసమే రాజీనామా: జగన్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదనే భావన కొందరిలో ఉండొచ్చని, ఆయన కుటుంబ సభ్యుల్లోనే కొందరికి ఈ అభిప్రాయం ఉండొచ్చని వాసిరెడ్డి పద్మ అన్నారు. కానీ, అది నిజం కాదని, వైఎస్సార్సీపీ ఈ పార్టీ మహిళల సాధికారత కోసమే పని చేస్తుందన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని తెలిపారు. తన స్వస్థలం జగ్గయ్యపేట నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. కానీ, పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. తాను పార్టీ కోసం అన్నింటికీ సిద్దమని వాసిరెడ్డి పద్మ తెలిపారు.
మహిళల కోసం వైఎస్సార్సీపీ: వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళలకు అండగా ఉందని తెలిపారు. తాను మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న మహిళలంతా వైఎస్సార్సీపీకి సపోర్టు చేయాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారత అనే పదానికి వైఎస్సార్సీపీ అర్థం చెప్పిందని వాసిరెడ్డి పద్మ తెలిపారు. గత ప్రభుత్వాలు మహిళల కోసం చాలా చేశామని చెప్పారని, కానీ జగన్ ప్రభుత్వంలో మహిళలకు అనేక అవకాశాలు ఇస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకంలో మహిళను భాగస్వామిగా చేస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే టికెట్ కోసమే రాజీనామా!: తాను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేయడం కోసమే రాజీనామా చేయడం లేదని వాసిరెడ్డి పద్మ తెలిపారు. వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉంటూ ప్రజా సమస్యల కోసం పోరాడటానికి రాజీనామా చేశానన్నారు. మనసున్న ప్రభుత్వానికి అంతా సహకరించాలని వాసిరెడ్డి పిలుపునిచ్చారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విషయమై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజీనామా చేయనున్న నేపథ్యంలో చివరిసారిగా మహిళా ఉద్యోగలతో వేడుకలు చేసుకోవడానికి వచ్చినట్లు వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.