Nitin Gadkari On Hyd Regional Ring Road : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఇచ్చాకే హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు(ఆర్ఆర్ఆర్) నిర్మాణం చేపడతామని కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ స్పష్టం చేశారు. గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు.
'హైదరాబాద్‌కు రూ.17 వేల కోట్ల విలువైన రింగురోడ్డు మంజూరుచేశాం. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ తామే చేస్తామని, ఆ వ్యయంలో 50% భరిస్తామని చెప్పింది. ప్రభుత్వం మారాక కొత్త సీఎం వచ్చి దీనిపై చర్చించారు. వారు భూసేకరణ పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్ రింగు రోడ్డు నిర్మిస్తాం' అని కేంద్రమంత్రి తెలిపారు.
త్వరగా పరిష్కారం కనుక్కుంటాం : విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవే (65) పనులు గతంలో జీఎంఆర్ సంస్థకు దక్కాయని నితిన్ గడ్కరీ వివరించారు. ఈ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని తెలంగాణ రోడ్ల భవనాల శాఖ మంత్రి చాలాసార్లు వచ్చి కలిశారన్నారు. రహదారి విస్తరణ అంశంపై జీఎంఆర్ సంస్థ, ఎన్‌హెచ్‌ఏఐ మధ్య పరస్పర కేసులు నడిచాయన్నారు. అవి ఆర్బిట్రేషన్, హైకోర్టులో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. సాధ్యమైనంత త్వరగా దీనికి పరిష్కార మార్గం కనుక్కుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పలుచోట్ల రహదారిని మెరుగుపరచడానికి టెండర్లు ఆహ్వానించాం. నెల రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని గడ్కరీ స్పష్టం చేశారు.
ఆ రెండు ప్రాజెక్టులు డీపీఆర్ దశలోనే : హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డుతో పాటు జాతీయ రహదారి 765లోని హైదరాబాద్-శ్రీశైలం సెక్షన్ ప్రాజెక్టులు డీపీఆర్ దశలో ఉన్నట్లు గడ్కరీ వివరించారు. తెలంగాణలో రహదారుల అప్‌గ్రెడేషన్‌పై ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈమేరకు వివరణ ఇచ్చారు.
కరీంనగర్-జగిత్యాల మధ్య నాలుగు వరుసల రహదారి నిర్మాణం టెండర్ల దశలో ఉన్నట్లుగా గడ్కరీ తెలిపారు. బిడ్ల ప్రక్రియ పూర్తికావడానికి 5 నెలలు, నిర్మాణ పనులు పూర్తికావడానికి రెండున్నరేళ్లు పడుతుందని వివరించారు. జగిత్యాల-రాయపట్నం మధ్య రహదారి పనులు డీపీఆర్ దశలో ఉన్నట్లుగా వెల్లడించారు.
ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు : మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైల్ విస్తరణకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి తోఖన్ సాహు వెల్లడించారు. గురువారం లోక్‌సభలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
పెరిగిన ఎయిర్పోర్ట్ ప్రయాణికులు : శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రయాణికుల సంఖ్య పదేళ్లలో 187% పెరిగినట్లు పౌరవిమానయాన శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ సహాయ మంత్రి మురళీధర్ ఆ వివరాలు వెల్లడించారు. ఎంపీ రఘునందన్‌రావు అడిగిన ఓ ప్రశ్నకు ఈమేరకు బదులిచ్చారు. 2013-14లో ఇక్కడి నుంచి 87 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేయగా, 2023-24 నాటికి ఆ సంఖ్య 2.5 కోట్లకు చేరినట్లు తెలిపారు. ఈ దశాబ్ద కాలంలో 11% సంచిత వార్షిక వృద్ధి నమోదైనట్లు వివరించారు. బంజార భాషను 8వ షెడ్యూల్‌లో చేర్చి రాజ్యాంగ గుర్తింపు ఇవ్వాలని మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన గురువారం ఈ విషయంపై లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడారు.
తెలంగాణ అభివృద్ధిలో ఆర్ఆర్ఆర్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? - rrr Importance today prathidhwani