Kishan Reddy fires on Congress : సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన వెంటనే, జూన్ 8 లేదా 9వ తేదీన మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఈసారి దేశ అభివృద్ధి, దేశ సమైక్యత, దేశ రక్షణ, స్వావలంబన, విద్యరంగాల అభివృద్ధికి బీజేపీకి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ వచ్చిన తరువాత దేశంలో మత కలహాలు, కర్ఫ్యూలు లేవని, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను చూసి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
సోమవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని జేపీఎల్ కన్వెన్షన్‌లో నిర్వహించిన బీజేపీ బూతు స్థాయి కార్యకర్తల సమావేశానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత కాంగ్రెస్(Congress Party) హయాంలో అన్ని దిగుమతి చేసుకునేవాళ్లమని, మోదీ ప్రధాని అయ్యాక చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మల నుంచి చంద్ర మండలానికి పంపే రాకెట్ల వరకు సొంతంగా తయారు చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విదేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించారు.
lok sabha elections 2024 : కాంగ్రెస్ హయాంలో కామన్వెల్త్, 2జీ, బొగ్గు, దాణా కుంభకోణం ఇలా అన్ని రంగాలలో, అవినీతి మాయం చేశారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మోదీ హయాంలో ఒక్క అవినీతి అయిన జరిగిందా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో దేశంలో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమంలో ఉన్న తేడా, కాంగ్రెస్ పాలనలో చేపట్టిన అభివృద్ధికి నక్కకి నాగలోకానికి అన్నట్లుగా ఉందన్నారు.
దేశంలో మతపరమైన రిజర్వేషన్లు తీసుకురావాలని చూస్తున్నారని, రాహుల్ గాంధీ(Rahul Gandhi) దేశ అభివృద్ధి, దేశ సమైక్యతకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో వంద రోజులో ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పటి వరకు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. వాటిపై తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ని ప్రశ్నించాలని కోరారు. రెండు లక్షల రుణమాఫీ, వృద్దుల, వికలాంగుల పింఛన్, రైతు భరోసా, మహిళకు 2500 ఎప్పుడు ఇస్తారో నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మోదీ వేవ్ దేశంతో పాటు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ చేవేళ్ల నియోజకవర్గ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. చేవెళ్లలో గెలిచేది బీజేపేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అసాధ్యమైన హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలని చూస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేయనని పారిపోయిన వ్యక్తిని, కాంగ్రెస్ నుంచి నిలబెట్టారని ఆయన ఎద్దేవా చేశారు.
సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన వెంటనే, జూన్ 8 లేదా 9వ తేదీన మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మోదీ హయాంలో దేశంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటెయ్యాలి. మోదీ వచ్చిన తరువాత మత కలహాలు, కర్ఫ్యూలు లేవు. కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కానీ హామీలిస్తోంది. - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి