Union Minister Bhupathi Raju Srinivasa Varma Visited Jangareddygudem : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కేంద్ర సహాయక మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పర్యటించారు. కేంద్ర మంత్రి అయిన తర్వాత మొదటిసారిగా జంగారెడ్డిగూడెం విచ్చేసిన ఆయనకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన కార్యక్రమం అనంతరం స్థానిక బీజేపీ నేత మల్లాది సీతారామారావు ఇంటికి వెళ్లారు. దీంతో పలువురు బీజేపీ, కూటమి నాయకులు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు.
భారీ పరిశ్రమల ఏర్పాటుకు కృషి : ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్ పనులు ప్రస్తుతం సత్తుపల్లి వరకు పూర్తయిందని తెలిపారు. మిగిలిన పనులు అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు. అలాగే త్వరలోనే విశాఖ రైల్వేజోన్ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. బీపీసీఎల్ కంపెనీ 70 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును వేరే రాష్ట్రాల్లో పెట్టాలనుకున్న దానిని ఏపీకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. ఆర్ అండ్ ఆర్ నిర్వాసితులను దృష్టిలో పెట్టుకుని జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో భారీ పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహలు అందిస్తామన్నారు.
శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు : విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశం బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీలో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ పరిశ్రమను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందని విమర్శించారు.
నిధులు విడుదలకు ఎప్పుడు సిద్ధం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని గుర్తుచేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.15 వేల కోట్ల నిధులు విడుదల చేసిందని, ఇంకా అవసరాల మేరకు నిధులు విడుదల చేసేందుకు కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. సాధ్యమైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడించారు.
కూటమి ప్రభుత్వంతో తిరుమలలో ప్రమాణాలు మెరుగుపడ్డాయి: కేంద్రమంత్రి - Union Minister Visited Tirumala