Bandi Sanjay Slams Congress Over MLC Kavitha Bail : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బీజేపీ బెయిల్ ఇప్పించిందని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బెయిల్‌కు, భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. ఒక పార్టీ, ఒక వ్యక్తి చెబితే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందనడం సిగ్గు చేటు అన్నారు. సుప్రీంకోర్టును ధిక్కరించేలా కాంగ్రెస్ వ్యాఖ్యలున్నాయని, అందుకే కోర్టు హెచ్చరించిందని గుర్తు చేశారు. బీజేపీ సభ్యత్వ నమోదుపై మోర్చాలు, సెల్స్ సంయుక్త కార్యశాలను నాగోల్‌లోని ఓ కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ కార్యశాలకు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభ ఉపన్యాసం చేశారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ విలీనం మాట, ముచ్చట పూర్తయ్యిందని, అమెరికాలో అప్పగింతలు కాబోతున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌తో కలిసి పని చేసి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్‌దేనని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌తో బీజేపీ కార్యకర్తలు కొట్లాడితే, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. భారత రాష్ట్ర సమితి గడీలను బద్దలు కొట్టిన చరిత్ర తమ పార్టీదేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం తనపై 109 కేసులు పెట్టిందని, రెండుసార్లు జైలుకు పంపిందని గుర్తు చేసిన ఆయన, కేసీఆర్ కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
బీజేపీ వల్లే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వ్యక్తులు, ప్రభుత్వాలు ఇచ్చే సూచనలతో కోర్టులు తీర్పులు, బెయిల్ ఇవ్వవు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ కలవడం పక్కా. రెండు పార్టీల మధ్య మాట, ముచ్చట పూర్తయింది. త్వరలోనే అమెరికాలో అప్పగింతలు కాబోతున్నాయి. - బండి సంజయ్, కేంద్రమంత్రి
ఈ క్రమంలోనే ఒవైసీ సల్కం చెరువును కబ్జా చేసి విద్యా సంస్థలను కట్టాడని చెబుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఒవైసీకి రాష్ట్ర ప్రభుత్వం భయపడి చేతులు ముడ్చుకుందని ఎద్దేవా చేశారు. ఓల్డ్ సిటీ, న్యూ సిటీ ఎందుకు కలవవు అని ప్రశ్నించారు. పాత బస్తీలో లక్ష సభ్యత్వం చేయాలని పిలుపునిచ్చారు. పాతబస్తీ మజ్లీస్ జాగీర్ కాదని, హిందువుల జాగీర్ అని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ కావాలనే లక్ష్యంతో సభ్యత్వ నమోదును సీరియస్‌గా తీసుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో 77 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేయించాలని మార్గనిర్దేశనం చేశారు. 2028లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.