Bandi Sanjay Comments on Kavita Bail : కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ గులాబీ, హస్తం పార్టీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం కాబోతుందనేది స్పష్టమైందని బండి సంజయ్ దుయ్యబట్టారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన అభిషేక్ మను సింఘ్వీ, కవిత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కవిత కేసును వాదించినందుకే కేసీఆర్ ఆదేశంతో, అభిషేక్ మను సింఘ్వీకి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిందని తెలిపారు.
కాంగ్రెస్‌కు మద్దతు : బీఆర్ఎస్కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎందుకు రాజ్యసభకు నామినేషన్ వేయలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇవాళ సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యశాలకు బండి సంజయ్ హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ నామినేషన్ వేయకుండా పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందా లేక బీజేపీలో విలీనం అవుతుందా ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.
బీజేపీని బద్నాం చేయడానికే : దిల్లీలో రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని, బీజేపీని బద్నాం చేయడానికే కాంగ్రెస్, బీఆర్ఎస్లు కుట్రలు పన్నుతున్నాయని బండి సంజయ్ దుయ్యబట్టారు. విగ్రహాల దందా రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు ఆయన హితవు పలికారు. ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నాటకం ఆడుతున్నాయని బండి దుయ్యబట్టారు.
సచివాలయం ఎదుట వాజ్పాయ్, రాజీవ్ గాంధీ, కేసీఆర్ విగ్రహం పెట్టాలా? అనే దానిపై చర్చ పెట్టాలన్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల కోసం డబ్బులు పంపేందుకే, హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. ధన్వాడ ఫామ్‌హౌస్ తనది కాదు లీజుకు తీసుకున్నానంటున్న కేటీఆర్, డ్రోన్ కెమెరా ఎగురవేసినందుకు రేవంత్ రెడ్డిపైన ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి మంచి వ్యక్తులు వస్తే కచ్చితంగా బీజేపీలో చేర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
"బీఆర్ఎస్ త్వరలో కాంగ్రెస్‌లో విలీనం కాబోతుంది. తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన అభిషేక్ మను సింఘ్వీ, కవిత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కవిత కేసును వాదించినందుకే కేసీఆర్ ఆదేశంతో, అభిషేక్ మను సింఘ్వీకి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది". - బండి సంజయ్, కేంద్రమంత్రి