Union Minister Shivraj Singh Chauhan Inspect Flood Situation : విజయవాడలో వరద పరిస్థితిని కేంద్ర వ్యవసాయశాఖమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా పరిశీలించారు. ముందుగా ఎయిర్‌పోర్టులో శివరాజ్ సింగ్‌కు మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎమ్మెల్యే సుజనాచౌదరి, అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు క్యాచ్‌మెంట్ ఏరియాలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాలు జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్ నగర్‌ను చూశారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని మంత్రి నారా లోకేశ్ చౌహాన్‌కు వివరించారు.
ఏరియల్ సర్వే అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించారు. బ్యారేజీ వద్ద కొనసాగుతోన్న గేట్ల మరమ్మతు పనులనూ పరిశీలించారు. బ్యారేజీ మరమ్మతు పనులు చేస్తోన్న వైనాన్ని తెలుసుకున్నారు. చౌహాన్‌తో పాటు బ్యారేజీ పరిశీలనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. భారీ వర్షాల వల్ల ఇటీవల బ్యారేజికి అత్యధికంగా రికార్డు స్థాయిలో వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని రీతిలో 11.46 లక్షల క్యూసెక్కుల పైగా వరద వచ్చినట్లు వెల్లడించారు. వరద ఉద్దృతి వల్ల ఎగువ నుంచి 4 భారీ పడవలు కొట్టుకొచ్చి బ్యారేజిని ఢీకొట్టినట్లు అధికారులు వివరించారు. రెండు గేట్ల వద్ద కౌంటర్ వెయిట్ లు ధ్వంసమైనట్లు తెలిపారు. భారీవరద రావడంతో బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో అపారంగా ఇళ్లు, పొలాలు నీట మునిగాయి అధికారులు మంత్రికి తెలిపారు.
బ్యారేజీ వద్ద పర్యటన ముగించుకొని విజయవాడ కలెక్టరేట్‌కి చేరుకున్నారు. కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఏపీ వరదల గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని, కేంద్ర సాయ త్వరగా అందేలా చూస్తానని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ చెప్పారు. కేంద్ర కమిటీ నివేదిక చూశాక ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చౌహాన్ సహాయ కార్యక్రమాలు బాగా చేశారని ప్రశంసించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారని, దగ్గరుండి మరీ సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారని చౌహాన్ కొనియాడారు.
బల్లకట్టుపై బుడమేరు ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన - CM CBN Visit Flood Affected Areas
బంగాళాఖాతంలో అల్పపీడనం - పలు జిల్లాల్లో భారీ వర్షాలు - IMD Issues Rainfall Alert to Ap