Motilal Naik Quits Hunger Strike Today : నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం 9 రోజులుగా గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేసిన మోతీలాల్ ఎట్టకేలకు నిరాహార దీక్ష విరమించారు. తనకు మద్ధతు తెలిపిన వారందరికీ పేరుపేరుగా ధన్యవాదాలు తెలిపారు. బుధవారం నుంచి ప్రత్యక్ష పద్ధతిలో నిరసనలు కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చేవరకూ వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.
నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నానట్లు మోతీలాల్ వెల్లడించారు. తొమ్మిది రోజుల దీక్షలో ఒక్క ఉద్యోగం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న పానీయాలు లేకుండా ఆమరణ దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. తన ఆరోగ్యం సరిలేకపోవడంతో దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీక్ష చేయడం వల్ల కిడ్నీ, లివర్లు పనిచేయని పరిస్థితికి వచ్చిందని తెలిపారు. కొత్త ప్రభుత్వం రాగానే తమ డిమాండ్లు పరిష్కరిస్తామన్నారని, కానీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రూపు1 1:100 శాతం చేయాలని మోతీలాల్ డిమాండ్ చేశారు. గ్రూపు 2, గ్రూపు 3 ఉద్యోగాలు పెంచాలన్నారు. డీఎస్సీ రద్దుచేసి మెగా డీఎస్సీ ప్రకటించాలని కోరారు. బుధవారం నుంచి ఉద్యోగాల కోసం నిరుద్యోగులంతా తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. 50 వేలు ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు జారీచేస్తూ ప్రభుత్వం జీవోలు ఇచ్చేవరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
గత తొమ్మిది రోజులుగా నిరుద్యోగుల సమస్యలపై ఆమరణ నిరాహరణ దీక్ష చేశాను. గతంలో కేసీఆర్ తొమ్మిది రోజులు దీక్ష చేస్తే రాష్ట్రం వచ్చింది. కానీ, నేను దీక్ష చేస్తే ప్రభుత్వం కనీసం స్పందించలేదు. నా ఆరోగ్య పరిస్థితి విషమించింది. అయినా ఈ ప్రభుత్వంలో స్పందన కరువైంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని మాత్రమే అడిగాం. కానీ, మా సమస్యలపై ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నా మనస్సు కలిచివేసింది. అందుకే నిరాహార దీక్ష చేశాను. - మోతీలాల్ నాయక్, నిరుద్యోగ జేఏసీ నాయకుడు