Two youngsters Drown In Farm Well in Asifabad : స్నేహితులైన ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి మండల కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. తుమిడే హరీశ్(22), కంబాల మహేశ్ (22)లు ఆదివారం సాయంత్రం ఒక పెళ్లికి వెళ్లి, చేను వద్దకు వెళ్లారు. బైక్ కొద్ది దూరంలో పార్క్ చేసి బావి వద్దకు వెళ్లారు. అక్కడ చీకటిగా ఉండటంతో ప్రమాదవశాత్తు జారిపడ్డారా? లేక ఈతకు వెళ్లి చనిపోయారా? అనేది తెలియాల్సి ఉంది. బావి సమీపంలో మద్యం బాటిళ్లు, చెప్పులు పడి ఉన్నాయి.
ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం, చింతలమానెపల్లికి చెందిన కంబాల మహేశ్ (22), ఖర్జెల్లి గ్రామానికి చెందిన తుమ్మిడే హరీశ్ (22) స్నేహితులు. ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి పెళ్లికి అని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో వారి కుటుంబసభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందారు. సోమవారం ఉదయం మండల కేంద్రం సమీపంలో గ్రామస్థులు పత్తి చేను వద్దకు వెళ్లగా అక్కడ ద్విచక్ర వాహనం, పక్కన మద్యం సీసా, ఆ పక్కనే వ్యవసాయ బావిలో చెప్పుల జతలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
పారాగ్లైడింగ్ చేస్తూ తెలంగాణ యువతి మృతి - హిమాచల్ ప్రదేశ్లో దుర్ఘటన
Two youngsters Drown In Farm Well : పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అనుమానంతో బావిలో గజ ఈతగాళ్లతో గాలించగా, ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా హరీశ్ మృతిపై అనుమానం ఉన్నట్లు అతని తండ్రి శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మహేశ్ తరఫున ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు. కౌటాల సీఐ షాదిక్ పాషా ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇద్దరు యువకులూ ప్రమాదవశాత్తు బావిలో పడ్డారా? లేదా వారి మృతికి ఇంకా ఏవైనా కారణాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కంబాల మహేశ్ తండ్రి గత ఏడాది మృతి చెందగా, అతని తల్లి వ్యవసాయ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మహేశ్ ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద పని చేస్తున్నాడు. అతనికి ఓ సోదరి, సోదరుడు ఉన్నారు. ఖర్జెల్లీకి చెందిన తుమ్మిడే శంకర్, అమ్మక్క దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్దవాడైన హరీశ్ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మహేశ్ సోదరుడి వివాహం ఆదివారం జరిగింది. అదేరోజు సాయంత్రం బయటకు వెళ్లిన హరీశ్, మహేశ్‌లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇరువురి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
రైతులకు గుడ్న్యూస్ - ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్