Child Died After Falling into Canal in Nizamabad : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మురికి కాల్వలో గల్లంతైన చిన్నారి కథ విషాదాంతంగా ముగిసింది. ఆనంద్‌నగర్‌లో బుధవారం సాయంత్రం డ్రైనేజీలో గల్లంతైన చిన్నారి మృతదేహం గురువారం ఉదయం లభ్యమైంది. చిన్నారి గల్లంతైన పన్నెండు గంటల తర్వాత మృతదేహాన్ని మున్సిపల్, అగ్నిమాపక సిబ్బంది సిబ్బంది గుర్తించారు. పాప మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
అప్పటివరకు ఆ చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ అప్పుడే ఇంటినుంచి బయటకు ఆడుకోవడానికి వెళ్లింది. అక్కడే పక్కన ఉన్న మురికి కాల్వ దగ్గర ఆడుకుంటూ ఆ చిన్నారి డ్రైనేజీలో కొట్టుకుపోయింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఈ సంఘటనపై స్పందించిన మున్సిపల్ శాఖ, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు.
స్థానికుల కథనం ప్రకారం : మహారాష్ట్రకు చెందిన దంపతులు గత కొంతకాలంగా నగరంలోని ఆనంద్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. భర్త సేల్స్‌మెన్‌గా, భార్య క్యాటరింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి చిన్న కుమార్తె బుధవారం సాయంత్రం ఇంటి ఎదుట ఆడుకుంటోంది. కొంత సమయం తర్వాత చిన్నారి కనిపించలేదు.
మురికికాలువలో రెండేళ్ల చిన్నారి మృతి : చిన్నారి నాన్నమ్మ చెల్లి ఎక్కడ అని మనవడిని అడగటంతో మురుగు కాల్వ వద్ద ఆడుకుంటోందని చెప్పాడు. అక్కడ వెళ్లి చూడగా బాలిక కనిపించలేదు. దీంతో కాల్వలో తన మనవరాలు పడిపోయిందని ఏడుస్తూ గట్టిగా కేకలు వేసింది. ఆ అరుపులకు స్థానికులు అక్కడికి చేరుకొని విషయం తెలుసుకొని మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్ మకరందు, ఫైర్ స్టేషన్ అధికారి నర్సింగ్‌రావు చేరుకొని సిబ్బందితో కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు.
కాల్వలో చిన్నారి కోసం పొక్లెయినర్ సహాయంతో వెతికినా ఆచూకీ లభించలేదు. చిన్నారి తల్లి పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాగా విషయం తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. తన తండ్రి కుమార్తె కాల్వలో పడిందంటే నమ్మకుండా చుట్టుపక్కల వెతకడం స్థానికులను కన్నీరు పెట్టించింది. మురుగు కాల్వ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గాలింపు చర్యలు ఇబ్బందికరంగా మారింది. చివరికి కష్టపడి నేడు ఉదయం మున్సిపల్ సిబ్బంది చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు.