Two Lakh Rupees Stolen from Scooty Dicky : పార్కింగ్ చేసిన స్కూటీ డిక్కీలోని రూ.2 లక్షలను పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఇందిరా చౌక్) బ్రాంచ్ ముందు జరిగింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలలో నమోదైన దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బంచరాయి తండాకు చెందిన లూనావత్ కల్కి, శ్రీ హనుమాన్ స్వయం సహాయక సంఘం గ్రూప్ లీడర్ కావడంతో అన్నపూర్ణ కాంప్లెక్స్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రూ.20 లక్షలు రుణం మంజూరయ్యాయి. ఆ రుణం డబ్బులను డ్రా చేసుకొని పంచుకోగా, తన డబ్బులు రూ.2 లక్షలు వచ్చాయి. ఆ డబ్బును తన సోదరుడు రంజిత్ ద్విచక్ర వాహనం డిక్కీలో ఉంచింది.
ఈ క్రమంలో తన బంధువు విజయ ఉపాధి హామీ పథకంలో పని చేసిన డబ్బులు తన అకౌంట్‌లో జమ అయ్యాయో లేదో తెలుసుకునేందుకు ఇందిరా చౌక్‌లోని ఎస్‌బీఐకి వెళ్లింది. బ్యాంకు ముందు స్కూటీని పార్క్ చేసి లోపలికి వెళ్లారు. ఉపాధి హామీ డబ్బులకు సంబంధించిన వివరాలను బ్యాంకులో తెలుసుకుని, మళ్లీ ద్విచక్రవాహనంపై తమ గ్రామానికి బయలుదేరి వెళ్లిపోయారు.
పెట్రోల్ కొట్టించుకోవడానికి స్కూటీ డిక్కీ ఓపెన్ చేస్తే షాక్ : ఇలా వెళుతుండగా గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో స్కూటీలో పెట్రోల్ పోయించుకునేందుకు డిక్కీ ఓపెన్ చేయగా, అందులో రూ.2 లక్షలు నగదు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు లూనావత్ కల్కి సోదరుడు తెలుసుకున్నాడు. వెంటనే ఆ విషయాన్ని ఆమెకు తెలిపాడు. బ్యాంకులో నగదు డ్రా చేసి బయటకు వచ్చిన కొద్దిసేపటికి రూ.2 లక్షలు కాజేశారని బాధితురాలు కన్నీరు మున్నీరయ్యారు. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకున్నారు. చోరీ జరిగిన బ్యాంకు వద్దకు చేరుకుని అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. దీని ఆధారంగా విచారణ చేపట్టారు.
Theft in Kamareddy: పూజకు వెళ్లి వచ్చే లోపు.. డబ్బు, బంగారం దోచేశారు.!