Two Junior Doctors Caught Buying Ganja in Hyderabad : పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ కొందరు గంజాయి మత్తుకు బానిసలుగా మారుతున్నారు. తెలంగాణలో వెలుగులోకి వచ్చిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. గంజాయి కొనుగోలు చేసేందుకు దూల్‌పేట్ వెళ్లిన ఇద్దరు జూడాలు పోలీసులకు దొరికిపోవడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాలు, మత్తు పదార్ధాలకు వైద్యులు సైతం అలవాటు పడటం ఆందోళన కలిగిస్తోంది. పదుల సంఖ్యలో జూడాలు ఈ మహమ్మారికి బానిసలుగా మారినట్లు పోలీసులు గుర్తించారు. గత మూడేళ్లుగా వైద్యవిద్యారులకు గంజాయి సరఫరా చేస్తున్న దూల్‌పేట్‌కు చెందిన సురేష్‌సింగ్ అలియాస్ టింకు సింగ్‌ను అరెస్ట్ చేసినట్టు టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్‌శాండిల్య తెలిపారు.
గంజాయి వాడుతున్న ఉస్మానియా వైద్యకళాశాలలో వైద్య విద్యారులు, జూనియర్ డాక్టర్లు కె.మనికందన్, వి.అరవింద్‌లకు వైద్యపరీక్షలు నిర్వహించి పాజిటివ్ రావటంతో అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 80 గ్రాముల గంజాయి, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దూల్‌పేట నివాసి సురేష్‌సింగ్ 2016 నుంచి అదే ప్రాంతానికి చెందిన దినేశ్ సింగ్ నుంచి గంజాయి సేకరించి విక్రయించేవాడు. మూడేళ్లుగా ఇతడి వద్దనే వైద్యవిద్యారులు గంజాయి కొనుగోలు చేస్తున్నారు.
దినేశ్ సింగ్ కుటుంబం సోలాపూర్ వెళ్లడంతో నిందితుడు రెండేళ్లుగా పంజక్‌సింగ్ వద్ద గంజాయి సేకరించి వైద్యవిద్యారులకు విక్రయిస్తున్నాడు. గుట్టుగా సాగుతున్న వ్యవహారంపై టీజీన్యాబ్‌కు సమాచారం అందగానే ఎస్పీ సీతారామ్ పర్యవేక్షణలో డీఎస్పీ నర్సింగ్‌రావు, ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ బృందం నిందితుడిని అరెస్ట్ చేశారు. గంజాయి కొనుగోలు చేస్తూ పట్టుబడిన వైద్యవిద్యార్ధులు ఎప్పుడైనా ఒకసారి ఒత్తిడి నుంచి బయటపడేందుకు వాడుతుంటామని, వదిలేయమంటూ పోలీసులను ప్రాధేయపడినట్లు సమాచారం.
గంజాయి సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ : వైద్యకళాశాలలో మరో 10 మంది వరకు మత్తు ఉచ్చులో చిక్కుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. నిందితుడిని సుల్తాన్‌బజార్ పోలీసులకు అప్పగించారు. డ్రగ్స్‌కు అలవాటుపడిన వైద్యవిద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పించనున్నారు. విద్యార్థుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని కట్టడి చేయటంలో ప్రజలు భాగం కావాలని సందీప్‌శాండిల్య పిలుపునిచ్చారు. గంజాయి గురించి సమాచారం తెలిస్తే 87126 71111 నెంబర్‌కు సమాచారం అందజేయాలని అందరికీ సూచించారు.