Two Guarantees Launch in Telangana 2024 : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. అభయహస్తం గ్యారంటీల్లో ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టింది. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (Free Electricity Scheme Launch 2024), మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా రూ.500కు సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మహిళా వికాసం కోసం సంక్షేమ పథకాలు: సీఎం జగన్
500 LPG Cylinder Scheme Launch : అయితే మొదట ఈ రెండు పథకాలను రంగారెడ్డి చేవెళ్లలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభా వేదికగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ ప్రాంతంలో సోమవారం రాత్రి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వేదిక మార్చాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే సచివాలయంలో రెండు గ్యారంటీ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రజా పాలనలో (Praja Palana in Telangana) దరఖాస్తు చేసిన తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ పథకాలను వర్తింపచేయనున్నట్లు తెలిపారు.
అంతకు ముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొన్నేళ్లుగా దేశంలో గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగిందని అన్నారు. పెరిగిన ధరల నుంచి మహిళలకు ఊరట కల్పించాలని భావించామని, అందుకే రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా 40 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. లోపాలు గుర్తించి పథకంలో మార్పులు చేసుకుంటూ వెళ్తామని వెల్లడించారు. త్వరలో నేరుగా లబ్ధిదారులు రూ.500కే సిలిండర్ పొందేలా ఏర్పాట్లు చేస్తామని వివరించారు.
ఆడపిల్లల కోసం.. 5 బెస్ట్ ప్రభుత్వ పథకాలు!
Minister Uttam On Two Guarantees :ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేస్తున్నామని చెప్పిన భట్టి, ఇవాళ మరో రెండు గ్యారంటీలు అమల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. పేదలకే ఎక్కువ ఉపయోగం కలిగేలా ఆరు గ్యారంటీలు ప్రకటించామని పునరుద్ఘాటించారు. దేశమంతా కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాల వైపు చూస్తోందని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని పేర్కొన్నారు.
"ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మేం చెప్పిన గ్యారంటీలు అమలు చేస్తున్నాం. కాంగ్రెస్ తన హామీలను అమలు చేయదని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేసింది. అన్ని గ్యారంటీల అమలు కోసం నిత్యం కృషి చేస్తున్నాం. పేదలకు పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు ఇస్తూ గ్యారంటీలు అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఉచిత కరెంటు ఇస్తాం. 200యూనిట్లు లోపు వాడే అందరికీ మార్చి నుంచి జీరో బిల్లు వస్తుంది. అర్హత ఉండి ఎవరైనా దరఖాస్తు చేయకపోయి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.ఎప్పుడైనా మండల కార్యాలయాల్లోకి వెళ్లి ప్రజాపాలన అధికారికి దరఖాస్తు ఇవ్వొచ్చు." - భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం