Parents Killed Kids And Committed Suicide in Telangana : అప్పులు తీర్చలేకపోతున్నామంటూ ఓ తండ్రి.. కుటుంబంలో కలహాలతో ఓ తల్లి.. తమ పిల్లల ఉసురు తీసి వారూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ విషాద ఘటనలో మొత్తం రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది మరణించారు. ఆన్‌లైన్ గేమ్‌కు బానిసైన ఓ తండ్రి వ్యసనం ఆ కుటుంబానికి భూమ్మీద నూకలు లేకుండా చేసింది. ఇక ఇంట్లో గొడవల కారణంగా మనస్తాపం చెందిన ఓ తల్లి తీరుకు తన ముగ్గురు పిల్లలు బలైపోయారు. ఈ ఘటనలపై పోలీసులు, కుటుంబ సభ్యులు ఏం చెప్పారంటే?
మంచిర్యాలకు చెందిన ఇప్ప వెంకటేశ్ (40), వర్షిణి (33) దంపతులు హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ గాజులరామారంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు రిషికాంత్ (11), విహాంత్ (3). వెంకటేశ్ నగరంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఉద్యోగం ముగిసిన తర్వాత అతడు ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం మొదలు పెట్టాడు. మొదట సరదాగా, కాసేపు వర్క్ టెన్షన్ నుంచి బయటపడడానికి మొదలు పెట్టిన ఈ ఆటలు నెమ్మదిగా వ్యసనంగా మారాయి. ఎప్పుడు చూసినా చేతిలో ఫోన్, ఫోన్‌లో గేమ్ అతడికి లోకంగా మారిపోయాయి.
ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై : అయితే ఈ ఆన్‌లైన్ గేమ్స్‌లో అతడు డబ్బు పెట్టి ఆడటం మొదలు పెట్టాడు. అలా నెమ్మదిగా వాటికి బానిసై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి డబ్బంతా కోల్పోయాడు. ఇక ఇంకా ఆడేందుకు డబ్బు కోసం లోన్‌యాప్స్, స్నేహితులు, తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. అలా అవసరం ఉందంటూ కుటుంబం కోసం అంటూ లక్షల్లో అప్పు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు గతంలో రూ.12 లక్షల వరకు అతడికి డబ్బు ఇచ్చారు. అయితే కొన్నాళ్ల పాటు ఆటను వదిలేశాడు వెంకటేశ్.
కానీ కొన్ని నెలల క్రితం మళ్లీ ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం ప్రారంభించాడు. మళ్లీ వాటిలో డబ్బు పెడుతూ అప్పులు చేశాడు. అలా దాదాపు రూ.25 లక్షల వరకు అప్పుు చేశాడు. ఇక అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి పెరిగింది. అది తట్టుకోలేని వెంకటేశ్ ఆ విషయం తన భార్యకు చెప్పాడు. అయితే అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో ఆమెకు కూడా అర్థం కాలేదు. నగలమ్మి తెద్దామన్నా అంత డబ్బు రాదు. అందుకే వెంకటేశ్ ఇక ఆత్మహత్యే శరణ్యమని భావించాడు. అయితే తానొక్కడే చనిపోతే అప్పుల వాళ్లు తన కుటుంబాన్ని వేధిస్తారని భయపడ్డాడో ఏమో? వాళ్లను కూడా బలవన్మరణానికి పాల్పడాలని ఒప్పించాడు.
అలా శనివారం (ఆగస్టు 31వతేదీ) రాత్రి 10 గంటలు దాటిన తర్వాత హాయిగా నిద్రపోతున్న తన ఇద్దరు పిల్లల ముఖాలపై దిండును అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి వాళ్లను చంపేశాడు. ఆ తర్వాత భార్యను కూడా ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. అందరూ చనిపోయారా లేదా అని ఓసారి చెక్ చేసిన తర్వాత సెల్ఫీ వీడియో తీసుకుని చీరతో వెంకటేశ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే చనిపోయే ముందు అర్ధరాత్రి 1.30 గంటలకు వాట్సాప్‌లో తన తండ్రికి మెసేజ్ చేశాడు. అందులో అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్, పక్కన ఫ్లాట్‌లో ఉండే ఓ వ్యక్తి ఫోన్ నంబర్ ఉన్నాయి.
తండ్రికి మెసేజ్ చేసి : అయితే ఆ మెసేజ్ చూసి ఆందోళనకు గురైన వెంకటేశ్ తండ్రి మొదట తన కుమారుడికి ఫోన్ చేయగా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత కోడలికి కాల్ చేసినా స్పందన రాకపోవడంతో తన కొడుకు పంపిన ఓ నంబర్‌కు కాల్ చేశాడు. పక్కన ఫ్లాట్‌లో ఉండే వ్యక్తి వెంటేశ్ ఇంటి తలుపును కొట్టగా ఎవరూ డోర్ తీయలేదు. కాస్త గట్టిగా తలుపు నెట్టడంతో అది తెరుచుకుంది. లోపలికి వెళ్లి చూడగా మంచంపై తల్లీ పిల్లలు, ఫ్యాన్‌కు వేలాడుతూ వెంకటేశ్ విగత జీవిగా కనిపించాడు. సదరు వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. సెల్ఫీ వీడియోను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.
మరో ఘటనలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరుకు చెందిన సుధాకర్, సువర్ణ(28) దంపతులు ఏడేళ్లక్రితం పటాన్‌చెరు మండలం రుద్రారానికి వచ్చారు. ఇక్కడే నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు జశ్వంత్(5) చిన్మయి(3) చిత్రనాథ్(3) ఉన్నారు. సుధాకర్ ఇస్నాపూర్‌లో మెకానిక్‌గా పనిచేస్తూ మద్యానికి బానిస కావడంతో అతడిని హైదరాబాద్‌లోని రీహాబిలిటేషన్ కేంద్రానికి పంపారు.
అయితే ఆదివారం (సెప్టెంబరు 1వతేదీ) ఉదయం నుంచి ఇంటి తలుపు తీయకపోవడంతో చుట్టుపక్కల బంధువులు అనుమానం వచ్చి తలుపులు బద్ధలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా పిల్లలు నురగలు కక్కి చనిపోయి కనిపించారు. మరోవైపు సువర్ణ ఉరి వేసుకొని విగత జీవిగా పడి ఉంది. స్థానికుల సమాచారంతో పటాన్‌చెరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా అక్కడ ఓ సూసైడ్ నోట్ కనిపించింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే తన కుమార్తెకు కొంతకాలంగా మతిస్థిమితం లేదని సువర్ణ తండ్రి చెప్పడం గమనార్హం.