Tungabhadra Dam Gate Repair Works: తుంగభద్ర 19వ గేటు కొట్టుకుపోవటంతో తాత్కాలిక గేటు ఏర్పాటు చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేసి నీటి వృథాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామని సాగునీటి రంగ నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. అధికారులతో కలిసి డ్యామ్ గేట్ల పటిష్టత, మరమ్మతుల పనులను మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ పరిశీలించారు. సాగునీటి నిపుణులు కన్నయ్య నాయుడుతో స్టాప్‌లాగ్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీరు వృథా కాకుండా ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని మంత్రులు తెలిపారు.
తాత్కాలిక గేటు ఏర్పాటుకు ఇంజినీరింగ్ సాహసం అద్భుతమని మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు అన్నారు. వృథాగా పోతున్న ప్రవాహం అఢ్డుకోవడం దేశంలోనే తొలిసారి ప్రయత్నమన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడడమే ఏపీ, కర్ణాటక లక్ష్యమని మంత్రులు అన్నారు. నిర్వహణ లోపం వల్లే ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతోందని మంత్రులు అన్నారు.
దేశంలోనే తొలిసారి ప్రయత్నం: తాత్కాలిక గేటు ఏర్పాటుకు ఇంజినీరింగ్ సాహసం అద్భుతమని మంత్రి పయ్యావుల నిమ్మల అన్నారు. వృథాగా పోతున్న ప్రవాహం అఢ్డుకోవడం దేశంలోనే తొలిసారి ప్రయత్నమని తెలిపారు. నీరు వృథా కాకుండా ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామన్న ఏపీ మంత్రులు, రైతుల ప్రయోజనాలు కాపాడటమే ఏపీ, కర్ణాటక లక్ష్యమన్నారు. రెండు రోజుల్లో 2, 3 గేట్లు ఏర్పాటు చేసుకోవాలని యోచనలో ఉన్నామన్నారు. కొన్ని రోజుల తర్వాత మరో 2 గేట్లు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నామని, నిర్వహణ విస్మరించడంతోనే ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతోందని మంత్రి నిమ్మల మండిపడ్డారు.
తుంగభద్ర నుంచి 3 రోజులుగా వృథాగా పోతున్న లక్షల క్యూసెక్కులు నీరు పోతోంది. దీంతో త్వరితగతిన స్టాప్‌లాగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నీటిని మరీ క్రస్టుగేట్ల దిగువకు తగ్గించకుండా అంతకన్నా ముందే స్టాప్‌లాగ్ ఏర్పాటు చేయాలని తుంగభద్ర బోర్డుతో పాటు ఆంధ్ర, కర్ణాటక అధికారులు నిర్ణయించారు.
తొలుత డ్యాం క్రస్టుస్థాయి 1613 అడుగుల వరకు నీటిని వదిలేసిన తరువాత కొట్టుకుపోయిన గేటు వద్ద స్టాప్‌లాగ్ ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. అయితే ఇలా చేయడం ద్వారా నీరు వృథా అవుతుందని భావించి, ప్రస్తుతం అలా కాకుండా క్రస్టుస్థాయి కన్నా ఎగువకు నీళ్లు ఉన్న సమయంలోనే స్టాప్‌లాగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కొట్టుకుపోయిన గేటు వద్ద స్టాప్‌లాగ్‌ను మొత్తం 5 ప్లేట్లలా తయారుచేస్తున్నారు. అందులో తొలుత మూడు ప్లేట్లు ఏర్పాటు చేస్తారు. 2 రోజుల్లో వీటి తయారీ పూర్తవుతుందని ఏపీ అధికారులు తెలియజేశారు. మూడు ప్లేట్ల ఏర్పాటు పూర్తయిన తర్వాత మళ్లీ 2 రోజుల గడువు ఇచ్చిన తరువాత మరో 2 ప్లేట్లతో మొత్తం గేటు ఖాళీ ప్రదేశాన్ని పూర్తిగా మూసివేయాలని భావిస్తున్నారు.
డ్యాంల గేట్లు తయారీలో నైపుణ్యం ఉన్న కన్నయ్యనాయుడు ఇప్పటికే జలాశయం వద్దకు చేరుకుని గల్లంతైన గేటు ప్రాంతాన్ని పరిశీలించారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో తదితర వివరాలు తెలుసుకున్న అనంతరం అధికారులతో చర్చించారు. స్టాప్‌లాగ్ నిర్మాణ ఖర్చుల కోసం 5 కోట్ల రూపాయల నిధుల వినియోగానికి తుంగభద్ర పాలకమండలి అనుమతి ఇచ్చిందని అధికారులు తెలిపారు.
కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు మరమ్మతులు ప్రారంభం - Tungabhadra Dam Repair Works Start