TTD Vigilance Officers Caught Fake Darshan Tickets : తిరుమలలో నకిలీ 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కలర్ జిరాక్స్‌తో వైకుంఠంలోకి వెళ్తున్న భక్తులను అధికారులు గుర్తించి నిలిపివేశారు. వైకుంఠంలోని స్కానింగ్ చేసే రుద్రసాగర్ అనే వ్యక్తి చొరవతో భక్తులు వెళ్తుండగా పూర్తి సమాచారంతో విజిలెన్స్ అధికారులు నిఘా వేశారు. చెన్నైకు చెందిన మోహన్ రాజ్ వద్ద నుంచి నాలుగు టికెట్లకు గాను 11 వేల రూపాయలు వసూలు చేశారు.
పాత నేరస్తుడైన అమృత యాదవ్, రుద్రసాగర్ కలిసి ఈ దందా చేస్తున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. నకలీ టికెట్ల ద్వారా ఈ నెల 17వ తేదీన 35 మంది భక్తుల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనం చేయించారు. ఒక్కో టికెట్టుకు గాను 2 వేలు చొప్పున భక్తుల నుంచి డబ్బులు సేకరించినట్లు విచారణలో తెలిసింది. 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్ల స్కానింగ్ ఉద్యోగి రుద్రసాగర్, అమృత యాదవ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.