TTD On Tirumala Shanthi Homam : కళియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సంప్రోక్షణ చర్యల్లో భాగంగా దోష నివారణ ఆలయ యాగశాలలో శాంతి హోమం చేపట్టారు. లడ్డూపోటు, విక్రయశాలలో వాస్తుశుద్ధి చేపట్టారు. కల్తీ నెయ్యితో వెంకన్న లడ్డూను తయారు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బ తీయడంపై సంప్రోక్షణ చర్యలు చేపట్టారు. కాసేపట్లో పండితులు పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామల రావు మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చితంగా శాంతిహోమం చేసినట్లు తెలిపారు.
"ఆలయంలోని అన్ని విభాగాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు చేశాం. స్వామివారికి మహా నైవేద్యం పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రసాదాల తయారీ కేంద్రాల్లో సంప్రోక్షణ చేస్తున్నాం. దోషం కలిగిందన్న భావన లేకుండా ఈ కార్యక్రమం చేపట్టాం. చివరిగా పూర్ణాహుతి కార్యక్రమంతో అన్ని దోషాలు తొలగుతాయి. భక్తులెవరూ ఆందోళన చెందవద్దు." అని ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు.
Shanthi Homam In Tirumala Today : ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేసినట్లు దీక్షితులు వెల్లడించారు. పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశామని, లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలొద్దని చెప్పారు. పవిత్రోత్సవాల ముందు జరిగిన దోషం పవిత్రోత్సవాలతో పోయిందని వివరించారు. మార్చిన నెయ్యితోనే ఆ తర్వాత ప్రసాదాలు తయారు చేశామని స్పష్టం చేశారు. తెలిసీ తెలియక జరిగిన దోషాలు శాంతి హోమం, సంప్రోక్షణతో పోతాయని వేణుగోపాల దీక్షితులు పేర్కొన్నారు. ఇక స్వామివారి ప్రసాదానికి కల్తీనెయ్యితో కలిగిన అపరాధానికి ఆలయం సహా అన్ని పోటుల్లో పంచగవ్య సంప్రోక్షణ చేపట్టారు. బూందీ పోటు, లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటులో పంచగవ్య సంప్రోక్షణ నిర్వహించారు.
పవన్ ప్రాయశ్చిత్త దీక్ష : తిరుమల లడ్డూ అపవిత్రంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుకొండలవాడా క్షమించు అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ గత పాలకుల వికృత పోకడలతో అపవిత్రమైందని, ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకమని పేర్కొన్నారు. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని అన్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.