TSRTC Bus Passes Decreased : గతంలో భాగ్యనగర ఆర్టీసీ బస్సుల్లో 11 లక్షల మంది ప్రయాణిస్తే, ప్రస్తుతం ఆ సంఖ్య 21 లక్షలకు చేరింది. ఇది సంస్థకు సంతోషకరమైన విషయమే. అయినా బస్‌పాస్‌లు మాత్రం 40 శాతం తగ్గినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. నగరంలో గత 3 నెలలుగా ఈ తగ్గుదల కనిపించిందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 9న రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం పథకం అందుబాటులోకి వచ్చింది.
దీని ద్వారా మహిళలకు నగరంలో తిరిగే బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. ఫలితంగా ప్రయాణికులు భారీగా పెరిగారు. అదే సమయంలో పాస్‌లు మాత్రం భారీగా తగ్గాయి. రాష్ట్ర నలుమూలలకు చెందిన వారు హైదరాబాద్‌లో నివసిస్తుంటారు. కొందరు ఉద్యోగ అవకాశాల కోసం, మరికొందరు చదువుకునేందుకు నగరంలో ఉంటారు. ఇక్కడకు వచ్చిన చాలా మంది ప్రజారవాణాపైనే ఆధారపడుతారు. నెలంతా ప్రయాణించేవారు బస్‌పాస్‌లు తీసుకుంటారు.
Bus Passes Decreased in TSRTC : నగరంలో ప్రస్తుతం విద్యార్థుల బస్‌పాస్‌లు లక్షా 60 వేలు, జనరల్ పాస్‌లు 90 వేలు, దివ్యాంగుల పాస్‌లు(Disabled Persons Bus Pass) 30 వేలు, ఎన్జీవో(NGO) పాస్‌లు 2 వేల వరకు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో అన్ని రకాల పాస్‌లు కలిపి 2 లక్షల 82 వేలు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం అందుబాటులోకి రావడంతో నగరంలో ఉండే అన్ని రకాల బస్ పాస్‌లపై ప్రభావం పడింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో 7 లక్షలకు పైగా బస్ పాస్‌లు ఉండేవి.
రాష్ట్రం విడిపోయిన తర్వాత బస్ పాస్‌ల సంఖ్య 4.50 లక్షలకు పడిపోయాయి. కరోనా సమయంలో కొంతకాలం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో కరోనా తర్వాత బస్ పాస్‌లు 3.9 లక్షల వరకు తగ్గిపోయాయి. మహాలక్ష్మి పథకం(Mahalakshmi Bus Scheme) అమలు తర్వాత బస్ పాస్‌ల సంఖ్య 2.82 లక్షలకు పడిపోయినట్లు ఆర్టీసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగరంలో ప్రస్తుతం 2 వేల 850 బస్సులు తిరుగుతున్నాయి.
కానీ 7 వేల 500ల వరకు బస్సులు అవసరం అని ఆర్టీసీ నివేదికలు చెబుతున్నాయి. తిరిగి బస్సులు పెరిగితే మళ్లీ ప్రయాణికులతో పాటు పాస్‌లు పెరుగుతాయని ప్రజా రవాణా నిపుణులు పేర్కొంటున్నారు. బస్సులు తక్కువగా ఉండడంతో చాలామంది వ్యక్తిగత వాహనాలు వినియోగిస్తున్నారు. దీంతో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైనట్లు తెలుస్తుంది.
ఎండ నుంచి ఉపమశమనం- సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేస్తున్న ఆర్టీసీ యాజమాన్యం - TSRTC