Cyber Crime in Hyderabad : సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా రోజుకో కొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఆర్కిటెక్ట్ అయిన మహిళకు రాత్రి వేళ ఫోన్ చేసిన దుండగుడు మాయమాటలతో బెదిరించాడు. అనంతరం వీడియో కాల్ చేసి ఉదయం వరకు పోలీసు కేసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉన్నాడు. తర్వాత వీడియోకాల్‌లో మాట్లాడుతూనే ఆమెను బ్యాంకుకు పంపి రూ.60 లక్షలు బదిలీ చేయించుకున్నాడు.
TSCSB Saved Foils Fraud Attempt : కానీ వెంటనే తేరుకున్న బాధితురాలు స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ)కి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు డబ్బులు డ్రా కాకుండా నిలువరించారు. వివరాల్లోకి వెళితే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నివసించే ఓ మహిళకు ఈ నెల 15న గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మహారాష్ట్ర పోలీసుగా పరిచయం చేసుకొని, మీరు మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారని, అరెస్ట్ వారెంట్ జారీ అయిందని ఆమెను బెదిరించాడు.
దీంతో భయాందోళనకు గురైన ఆ మహిళ తనను కాపాడమని అతడిని కోరింది. ఇదే ఆసరాగా స్కైప్‌లో వీడియోకాల్ చేసిన దుండగుడు పలు విధాలుగా ఆమెను భయభ్రాంతులకు గురిచేశాడు. వాష్‌రూంకు కూడా వెళ్లనీయకుండా మరుసటి రోజు ఉదయం బ్యాంకు తెరిచే సమయం వరకు వీడియోకాల్ ఆన్‌లోనే ఉంచేలా చేశాడు. ఆపై కేసును కొట్టేసేలా చేస్తానంటూ బాధితురాలిని బ్యాంకుకు పంపించి పలు ఖాతాలకు రూ.60 లక్షలు బదిలీ చేయించుకున్నాడు.
పార్శిల్ పేరిట మోసం - బాధితుడి ఖాతా నుంచి రూ.20 లక్షలు స్వాహా - Cyber fraud in the name of parcel
ఇదంతా ముగిసే వరకు కూడా వీడియోకాల్ కొనసాగిస్తూనే ఉండేలా ఒత్తిడి చేయడం గమనార్హం. కొంతసేపటికే తాను మోసపోయానని గ్రహించిన సదరు మహిళ వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఎస్‌బీ బృందం ఆన్‌లైన్ లావాదేవీల వివరాలను సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్)లో నమోదు చేయించారు. అలాగే ఎస్‌బీఐ ఖాతాలకు నగదు బదిలీ కావడంతో ఆ బ్యాంకు ప్రతినిధులనూ అప్రమత్తం చేశారు. గంటలోపే ఈ ప్రక్రియనంతా ముగించడంతో ఆయా ఖాతాల నుంచి నగదును ఎవరూ ఉపసంహరించకుండా నిలిపివేయించారు. దీంతో బాధితురాలు ఊపిరి పీల్చుకున్నారు.
మరోసారి నిరూపించిన సీఎస్‌బీ : సైబర్ నేరస్థులు సొమ్ము కొట్టేసినా, సత్వరం ఫిర్యాదు చేస్తే వెనక్కి తీసుకురావొచ్చని సీఎస్‌బీ మరోసారి నిరూపించింది. ఇటీవలే రూ.కోటి కొట్టేస్తే 25 నిమిషాల్లోనే స్పందించి నిందితులకు చేరకుండా ఆపివేయించిన ఘటన తెలిసిందే. ఈ సందర్భంగా సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయెల్ ఎస్సై శిరీష, కానిస్టేబుళ్లు కృష్ణ, రెహమాన్‌లకు అభినందనలు తెలిపారు. పోలీసులు లేదా ప్రభుత్వ సంస్థల ప్రతినిధులెవరూ వీడియోకాల్ లేదా స్కైప్ కాల్ చేసి డబ్బులు అడగరని, అలా ఎవరైనా ఫోన్ చేస్తే, 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని శిఖాగోయెల్ ప్రజలకు సూచించారు.