Tribals Facing Problem at Parvathipuram Manyam District: తరాలు మారినా గిరిజన బతుకుల్లో మాత్రం ఎలాంటి ప్రగతి కనపడటం లేదు. రహదారి సౌకర్యం, వైద్యం, విద్యుత్, విద్య వంటి కనీస మౌలిక వసతుల లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిరిజనుల అభివృద్ధికి తోడ్పతామని చెప్పిన పాలకుల మాటలన్నీ ఎండమావులవుతున్నాయి. ఫలితంగా వీరి జీవితాల్లో ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు. తాగునీటి సదుపాయం లేక అక్కడి ప్రజలు ఊటలపై ఆధారపడి జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రస్తుత వేసవి కాలంకావడం తాగునీటి సమస్య మరింత జఠిలమవుతోంది. తాగునీరు కొరతతో తీవ్రంగా అల్లాడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Drinking Water Problem: గిరిజనుల దాహం కేకలు.. నీటి ఊటలే ఆధారం
నిత్యం నీటి కష్టాలతో మన్యం వాసులు: పాలకులు గిరిజనుల అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నామని చెప్పడం అనేది మాటల్లో తప్ప చేతల్లో కనిపించటం లేదని సీపీఎం నాయకులు కొల్లి సాంబమూర్తి మండిపడ్డారు. ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది అనేది తెలుసుకొని ఐటీడీఏ (ITDA) అధికారులకు తెలియజేసే పరిస్థితి ఉందా అని సాంబమూర్తి ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం మారుమూల గిరిజన నయా పంచాయతీ నయా గ్రామంలో 52 మంది గిరిజన కుటుంబాలు జీవిస్తున్నారు. నిత్యం నీటి సమస్యలతో సతమతమయ్యే గిరిజన వాసులు వేసవికాలం రావడంతో తాగునీటి సమస్య మరింత ఎక్కువైంది.
సొంత డబ్బులతో పైప్లైన్ కనెక్షన్: గ్రామంలో ఉన్న బోరు పూర్తిగా మరమ్మతులకు గురయింది. నీటి సమస్యపై అధికారులు పట్టించుకోకపోవటంతో గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఊట గెడ్డ వద్ద ఒక కుండి స్వంతగా నిర్మించుకున్నారు. ఆ కుండీ నుండి నయా గ్రామానికి కిలోమీటర్ దూరం ఉండడంతో నీటి సరఫరా చేయడానికి సుమారు కిలోమీటరు మేర పైపు కనెక్షన్లు పెట్టారు. ఆ పైపును గ్రామం వరకు నిర్మించడానికి సుమారు లక్ష రూపాయలు ఖర్చు అయిందని సాంబమూర్తి తెలిపారు. గ్రామంలో 52 కుటుంబాలు కలిసి ప్రతి ఇంటి నుంచి రూ.2,500 రూపాయలు వసూలు చేసుకొని పైప్లైన్ కోసం ఖర్చు పెట్టడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ విధంగా ఖర్చుపెట్టిన డబ్బును అధికారులు గ్రామస్థులకు చెల్లిస్తానని చెప్పి సంవత్సరమైందని, ఇప్పటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని సాంబమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి వర్షం వస్తే బురద నీరు, ఎండాకాలం వస్తే ఊట నిరు తప్ప మరో మార్గం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధమైన కలుషిత నీరు తాగడం వల్ల జ్వరాలతో ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. అదే విధంగా గ్రామాల్లో వీధిలైట్లు కూడా ఒకటి రెండు తప్ప పూర్తిస్థాయిలో లేవని దీనిపై ఐటీడీఏ అధికారులు స్పందించి నయా గ్రామానికి వెళ్లి పూర్తిస్థాయిలో పరిశీలించి గిరిజనులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
గూడు లేకా గోసపడుతున్న గిరిజనులు - అండగా ఉంటానని పట్టించుకోని సీఎం జగన్