Transport Officials Seizing Unfit School Buses : కొన్ని విద్యాసంస్థలు ఫిట్‌నెస్ లేని బస్సుల్లోనే విద్యార్థులను ఇంటి నుంచి పాఠశాలలకు తరలిస్తున్నాయి. దీంతో చిన్నారుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బడి బస్సులపై కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వం రవాణా శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో ఫిట్‌నెస్ లేని బస్సులు ఎక్కడ కనిపిస్తే అక్కడే అధికారులు జప్తు చేస్తున్నారు.
గత పది రోజుల్లో 489 విద్యాసంస్థల బస్సులను సీజ్ చేశారు. 575 పాఠశాలల బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఫిట్‌నెస్ లేకుండా బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాసంస్థల యాజమాన్యాలను హెచ్చరిస్తున్నారు.
ఫిట్‌నెస్ లేని బస్సులు రోడ్డుఎక్కితే కఠినచర్యలు తప్పవు : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 12,631 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. అందులో హైదరాబాద్‌లో 1,290 మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 5,609 , రంగారెడ్డి జిల్లాలో 5,732 వరకు విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్‌లో 155 బస్సులకు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 382 బస్సులకు, రంగారెడ్డి జిల్లాలో 481 బస్సులకు ఫిట్‌నెస్ చేయించుకోలేదు.
ఈ మూడు జిల్లాల పరిధిలో 1,018 బస్సులు ఫిట్ చేయించుకోలేదని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో హైదరాబాద్‌లో 154 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 71 కేసులు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 72 కేసులు నమోదు అయ్యాయి. మూడు జిల్లాలకు కలిపి 20,86,000 రూపాయల జరిమానను అధికారులు వసూలు చేశారు. హైదరాబాద్‌లో 121 బస్సులను, రంగారెడ్డిలో 68 బస్సులను, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 67 బస్సులను రవాణాశాఖ అధికారులు జప్తు చేశారు.
575 విద్యాసంస్థల బస్సులపై కేసులు నమోదు : రాష్ట్ర వ్యాప్తంగా 23,824 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. వీటిలో 2,879 బస్సులకు ఇప్పటి వరకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 575 విద్యాసంస్థల బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 489 బస్సులను సీజ్ చేసినట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి అత్యధికంగా సంగారెడ్డిలో 42 బస్సులు, కరీంనగర్‌లో 20, ఖమ్మంలో 20, నారాయణపేట్‌లో 19 బస్సులను జప్తు చేసారు. హనుమకొండలో 13, సిద్దిపేట్‌లో 12, యాదాద్రి జిల్లాలో 10 బస్సులను సీజ్ చేశారు.
రోడ్డెక్కిన బడి బస్సులు - తనిఖీలు చేపట్టిన అధికారులు - School Buses Checkings In Telangana