Trains Cancelled: గత ఏడాదిగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) విజయవాడ డివిజన్ పరిధిలో భద్రతా పరమైన ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో తరచుగా సింహాద్రి, ఉదయ్, రాయగడ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. అయితే వీటిని రద్దు చేసేటప్పుడు ప్రత్యామ్నాయంగా జన్మభూమి, రత్నాచల్ రైళ్లు నడుస్తుండడంతో ప్రయాణికులు పెద్దగా ఇబ్బందులు పడలేదు. అయితే కీలకమైన ఈ రైళ్లను 47రోజులపాటు రద్దు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ నుంచి అన్నవరం, రాజమహేంద్రవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ వెళ్లే ప్రయాణికుల్లో ఎక్కువ మంది జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లలోనే ఎక్కుతారు. దీనికి కారణం వీటి ఛార్జీలు తక్కువగా ఉండడమే. ఒక్కో రైలులో రోజుకు 2 వేల మంది ప్రయాణం చేస్తారని అంచనా వేసినా, మూడు రైళ్లను కలిపి సుమారు 6 వేల మందిని ప్రయాణిస్తున్నారు.
తిరుగు ప్రయాణంలో సైతం ఇదే స్థాయిలో జనాలు ఆయా రైళ్లను ఆశ్రయిస్తారు. ఈ లెక్కన రోజుకు 12 వేల మంది ఆయా రైళ్లపై ఆధాపడుతున్నారు. అంతటి కీలకమైన రైళ్లను ఈనెల 24వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఏకంగా 47 రోజులపాటు రద్దు చేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది. కనీసం మూడింటిలో ఒక్క ట్రైన్ అయినా నడపాలంటూ పలువురు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతారని వాపోతున్నారు.
విశాఖ స్టేషన్ మీదుగా నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, వాటిల్లో సూపర్‌ఫాస్ట్‌లు, ఎక్స్‌ప్రెస్, పాసింజర్‌లు ఉన్నాయి. అయితే వీటిలో దూర ప్రాంతాలైన హావ్‌డా, న్యూదిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు వెళ్లే రైళ్లను యథావిధిగా నడుపుతున్నారు. కేవలం విశాఖ నుంచి విజయవాడ, హైదరాబాద్, గుంటూరు వెళ్లే రైళ్లను మాత్రమే రద్దు చేయడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. వాటిని పూర్తిగా రద్దు చేయకుండా కనీసం రాజమహేంద్రవరం వరకు నడిపినా బాగుండేదంటున్నారు.
విశాఖ నుంచి విజయవాడకు జన్మభూమి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లలో సెకండ్ సిటింగ్ సీటు ఛార్జీ కేవలం 150 రూపాయలు మాత్రమే ఉంటుంది. అదే ఆర్టీసీ బస్సులో అయితే 600 రూపాయలకు పైనే ఉంటుంది. అంటే బస్సు ఛార్జీ నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. దీని కారణంగా పేద, మధ్య తరగతి ప్రజలు ఈ రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. అంతటి కీలకమైన రైళ్లను రద్దు చేయడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ ప్రభావం కారణంగా ఇప్పటికే వాల్తేరు డివిజన్ అధికారులకు నిరసన సెగ మొదలైంది.
దీంతో ప్రయాణికుల ఇబ్బందులను దక్షిణ మధ్య రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఇప్పటికే పనులు ఆలస్యమయ్యాయని, తప్పని సరి పరిస్థితుల్లో రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం (Divisional Commercial Manager) కె.సందీప్ తెలిపారు. పనులు జరిగే కొద్దీ 10 రోజుల్లో రద్దు చేసిన రైళ్లలో కొన్నింటిని తిరిగి పట్టాలపైకి ఎక్కించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
Indian Railways serving Meals at Rs 20 : రైల్వే ప్రయాణికులకు.. రూ.20కే భోజనం..!