Traffic Problems In Hyderabad : ఆషాఢమాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరం పసుపు, కుంకుమలు అద్దుకుంటుంది. వేప వాసనలతో ఊరువాడ డప్పు చప్పుళ్లతో మురిసిపోతుంది. దశాబ్దాలుగా సాగుతున్న బోనాల వేడుకలు ఆదివారం గోల్కొండలో వైభవంగా ప్రారంభమయ్యాయి. బోనాల సందర్బంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రముఖుల రాకపోకలు, రోజువారీ రద్దీకి తోడు పోలీసుల ఆంక్షలతో హైదరాబాద్‌లో సోమవారం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ముఖ్యంగా సచివాలయం చుట్టుపక్కల సాయంత్రం తర్వాత వాహనాలు ముందుకు కదలడం కష్టమైపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుకున్నాయి. ఈ ప్రభావంతో లక్డీకాపూల్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, మాసబ్‌ట్యాంక్ తదితర ప్రాంతాల్లోనూ విపరీతమైన రద్దీ ఏర్పడింది.
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ : ఐటీ, కార్యాలయాలు ముగించుకుని ఉద్యోగులు ఇళ్లకు చేరే సమయం కావడంతో కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటరు ప్రయాణానికి గంట సమయం పట్టింది. దివంగత సీఎం వైఎస్ జయంతి వేడుకల నేపథ్యంలో పంజాగుట్ట సర్కిల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడంతో ప్రముఖుల రాకపోకలతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం సందర్భంగా సోమవారం నుంచి గ్రీన్‌ల్యాడ్స్, అమీర్‌పేట, ఫతేనగర్, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, బీకేగూడ, తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. సాధారణ మార్గాలకు బదులు ఇతర దారుల్లో వాహనాలను మళ్లించడంతో ఈ సమస్య వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఆషాఢం బోనాల సంబరాలు : లోయర్ ట్యాంక్‌బండ్ దగ్గర కట్టమైసమ్మ ఆలయం దగ్గర బోనాల జాతర నేపథ్యంలో తెలుగుతల్లి వంతెనపై వాహనాలను ఒకవైపు మాత్రమే అనుమతించారు. ఈ ప్రభావం చుట్టుపక్కల కిలోమీటర్ల మేర కనిపించింది. లక్డీకాపూల్ నుంచి సచివాలయం ట్యాంక్‌బండ్, లోయర్‌ట్యాంక్ బండ్, హిమాయత్‌నగర్ వెళ్లే వాహనదారులు ఎక్కువ సమయం రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. బేగంపేట పోలీస్ లైన్స్ నుంచి రసూల్‌పుర, హాకీగ్రౌండ్స్, ప్యారడైజ్ నుంచి సీటీవో ఫ్లైఓవర్‌కు వెళ్లే 1.2 కిలోమీటర్ల మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
కిలోమీటరు ప్రయాణానికి గంట : కిలోమీటరు ప్రయాణానికి అరగంట నుంచి గంట సమయం పట్టిందని వాహనదారులు తెలిపారు. అయోధ్య జంక్షన్, నిరంకారీభవన్, షాదన్ కళాశాల నుంచి వీవీ విగ్రహం వరకూ ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకుగురయ్యారు. కిలోమీటరు దూరానికి దాదాపు 45 నిమిషాల వరకూ సమయం పట్టింది. ఎస్‌డీ కంటి ఆసుపత్రి, హుమాయున్ నగర్, ఎన్‌ఎండీసీ, మాసబ్‌ట్యాంక్ వరకూ వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది.
ఈ ట్రాఫిక్ ఏంటి బాబో..య్! - హైదరాబాద్‌లో చుక్కలు చూస్తున్న వాహనదారులు - hyderabad traffic issues
హైదరాబాద్‌లో ట్రాఫిక్ భూతం - అధికారులు చలానాలకే పరిమితం - వాహనదారులకు తప్పని నరకం