Tractor Accident in Palnadu District : పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు వ్యవసాయకూలీలను బలి తీసుకుంది. ముప్పాళ్ల మండలం బొల్లవరం నాలుగో మైలు సమీపంలో కాల్వకట్టపై వ్యవసాయకూలీలతో వెళ్తుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో చాగంటి వారి పాలెంకు చెందిన నలుగురు మహిళ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 20 మందికి పైగా మహిళా కూలీలు ఉన్నారు.
వీరంతా మిరపకాయల కోతకు వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అప్పటివరకూ తమతో కలివిడిగా ఉండి కబుర్లు చెప్పిన తోటి కూలీలు విగత జీవులుగా మారడంతో విషాదం నెలకొంది. కాల్వకట్ట మీద ట్రాక్టర్ అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. గాయపడిన వారిని సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మృతుల కుటుంబాలకు సీఎం భరోసా : ముప్పాళ్లలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి గంగమ్మ, సామ్రాజ్యం, మాధవి, పద్మ అనే నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.
ముందస్తు చర్యలు చేపట్టాలి : ప్రమాదంపై పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడిన గొట్టిపాటి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. వ్యవసాయ సీజన్లో రైతులు, కూలీలు పొలం పనులు మీద తిరిగే సమయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.